అయోధ్యపై తీర్పు..! యూపీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా కేంద్ర బలగాలు..

అయోధ్యపై తీర్పు..! యూపీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా కేంద్ర బలగాలు..

అయోధ్య తీర్పు వెలువడే అవకాశం ఉన్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం. వాటికి అదనంగా కేంద్రం నాలుగు వేల మంది కేంద్ర సాయుధ బలగాలను యూపీకి పంపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీకి చెందిన 15 కంపెనీల బలగాల్ని యూపీకి తరలించారు. నవంబరు 11న కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన మరో 15 కంపెనీలను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.  అయోధ్య తీర్పు వెలువడక ముందు, వెలువడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఉన్నతాధికారులు. అయోధ్యలో 'రామజన్మభూమి-బాబ్రీమసీదు' భూవివాదం కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది.