పులి కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్.. ముమ్మర ప్రయత్నాలు..!

పులి కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్.. ముమ్మర ప్రయత్నాలు..!

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లో మనుషులను చంపిన పులిని పట్టుకోవడం కోసం అధికారులు అడవుల్లో ఆపరేషన్ చేపట్టారు. పులిని పట్టుకోవడానికి ప్రత్యేక టీములను రంగంలోకి దింపారు. జిల్లాలో గత నవంబర్ లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది పెద్ద పులి. దిగిడలో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపింది పులి. దీంతో వెంటనే పులిని  పట్టుకుంటామని అధికారులు ప్రకటించారు. దాదాపు రెండు నెలలు దాటింది. పులిని పట్టుకోలేకపోయారు. ఒకవైపు పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతుండగానే  పెంచికల్ పేట మండలం కొండపల్లిలో మరో మహిళపై పంజా విసిరి చంపేసింది పులి. ఇద్దరు ఆదివాసులను పొట్టన పెట్టుకున్న పులిని... పట్టుకోవాలని పట్టుబట్టారు ఆదివాసీలు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పులి అడుగుజాడలు బయటపడుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పశువులపై పులి దాడులు చేస్తూనే ఉంది. ఆదివాసీల నుంచి వ్యతిరేకత పెరిగింది. అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ఇద్దరిని చంపిన పులులు ఎన్ని అనే విషయాన్ని కనుగొన్నారు. ఇద్దరిపై దాడి చేసింది ఒక్కటే పులిగా నిర్ధారణకు వచ్చారు.

ఇద్దరిని చంపిన పులి ఏ2గా భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఈ పులి సంచరించే 8 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పులికి మత్తు మందు ఇచ్చేందుకు వందల కొద్దీ ట్రాక్ కెమెరాలు, 14 బోన్లు ఏర్పాటు చేశారు. 40 మంది వరకు యానిమల్ ట్రాకర్స్ పులి ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. ఈసారి కచ్చితంగా పులిని పట్టుకుంటామంటున్నారు అటవీశాఖ అధికారులు. పులి సంచరిస్తుందని అనుమానం ఉన్న తలాయి, గుండ్లపల్లి, కందిభీమన్న అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. ఈ మంచెలపై నుంచే పులికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కొద్ది రోజుల్లోనే పులిని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు అటవీశాఖ అధికారులు. నిన్నటి నుంచి అడవుల్లో నే అధికారులు మకాం వేశారు.. తెలంగాణ నుంచి ప్రవీణ్, మహారాష్ట్ర తడోబా టీమ్ నుంచి రవికాంత్ కొబ్రగడే  నిపుణులతో ఈ ఆపరేషణ్ కొనసాగుతోంది.. మంచేల మీద నుంచి నిపుణులైన షూటర్స్ తో మత్తు మందు ప్రయోగం చేయనున్నారు అధికారులు. మరిన్ని బొన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.. పులి చిక్కితే వెంటనే తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేశారు.. మంచెలపై ఉండి పులి కోసం ఎదురు చూస్తున్నారు మత్తు ఇచ్చే నిపుణులు.. ఇప్పటి కే ఆపరేషన్ జరిగే బేజ్జూరు అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.