దారి తప్పిన టీచర్..దొంగల ముఠాకి నాయకుడయ్యాడు !

దారి తప్పిన టీచర్..దొంగల ముఠాకి నాయకుడయ్యాడు !

 అతనో ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అతను దారితప్పాడు. చోరీలెలా చేయాలో దొంగలకు పాఠాలు నేర్పాడు. దొంగల ముఠా నాయకుడయ్యాడు. చివరికి ఆ దొంగల టీచర్ తో సహా గ్యాంగ్ మొత్తాన్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే కోసూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కల్వకర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు. వైజాగ్ కు చెందిన ఈ శ్రీనివాస్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నివాసముంటూ దొంగతనాలకు స్కెచ్ వేస్తుంటాడు. పదేళ్ల క్రితం వరకు పాఠశాల్లో టీచర్ గా పనిచేసిన శ్రీనివాసరావుకు అక్కడ దొంగతనాలు చేసే ఉదయ్ కుమార్ తో పరిచయమేర్పడింది. 

ఎన్నాళ్లు పాఠాలు చెప్పుకున్నా.. ఏంటి ప్రయోజనం.. ఒకేసారి సంపన్నుడిని కావాలని అనుకునేవాడు శ్రీనివాస్. చోరీ కేసులో జైలుకెళ్లిన అతను జైళ్లల్లో పరిచయమైన ఖైదీలతో గ్యాంగును ఏర్పాటు చేసేవాడు. ఖైదీలను బెయిళ్లపై బయటికి తెచ్చేందుకు వారికి అవసరమైన న్యాయవాదిని ఏర్పాటు చేసి ష్యూరిటీలను కోర్టుకు ఇచ్చి విడుదల చేయించేవాడు. అలా జైళ్ల నుంచి విడుదల ఖైదీల నుంచి లాయర్ ఫీజు డబ్బును వసూలు చేసుకోవడానికి దొంగతనాలు చేయించేవాడు. రూమ్ లు, ఇళ్లను అద్దెలకు ఇప్పించాక చోరీకి అవసరమైన స్క్రూ డ్రైవర్లు, ఇనుపరాడ్లను ఇతర పరికరాలిచ్చేవాడు. 

చోరీ చేసొచ్చాక బంగారు, వెండి నగలను అమ్మి పర్సంటేజ్ లను తీసుకునేవాడు శ్రీనివాసరావు.  తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటి వరకు 48 చోరీ కేసుల్లో నిందితుడిగా శ్రీనివాసరావు ఉన్నాడు. ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఏడుగురు దొంగలు ఉంటూ.. పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవారు. గుంటూరు జైల్లో పరిచయమైన మళ్లచెర్వు రామారావు, చింతల సిసింద్రి, మువ్వా సురేష్, ఒంగోలు జైల్లో పరిచయమైన శంకర్ తో చోరీలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. 

తెలంగాణలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ తో పాటు , మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్  తో పాటు..ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి 17న్నర తులాల బంగారు నగలు, 300 తులాల వెండిఆభరణాలు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారం, వెండి నగలతో పాటు.. డబ్బును బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని.. ఇళ్లల్లో బీరువాల్లో డబ్బు దాచుకోవద్దని దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.