తెలకపల్లి రవి : సుప్రీం కొట్టివేతతో రాజధాని ప్రతిష్టంభనే

తెలకపల్లి రవి : సుప్రీం కొట్టివేతతో రాజధాని ప్రతిష్టంభనే

తెలకపల్లి రవి

                     సిఆర్‌డిఎ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాల ద్వారా  విశాఖకు పాలనా రాజధానిని తరలించాలనే జగన్‌ ప్రభుత్వాల ప్రయత్నం ప్రతిష్టంభనలో పడినట్టే. ఈ విషయమై అమరావతి రైతుల జెఎసి తరపున దాఖలైన పిటిషన్‌ విచారిస్తున్న ఏపీ హైకోర్టు విధించిన యథాతథ స్థితిని ఎత్తివేయడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇంత తక్షణమే విచారించాల్సిన అవసరం లేదని భావించింది. నిజంగానే ప్రస్తుత ప్రభుత్వం వ్యూహాత్మకంగా మూడు రాజధానుల విధానం ముందుకు తెచ్చివుండొచ్చుగాని  ఉన్నత న్యాయస్థానాలకు అదేమీ అత్యవసర సమస్య కాదు. కాకుంటే చట్టసభలు ఆమోదించి గవర్నర్‌ గెజట్‌ విడుదల చేశారు గనక  అది పాలనా పరిధిలోది అన్నది రాష్ట్ర ప్రభుత్వల వాదన. శాసన ప్రక్రియ కోర్టు పరిధిలో వుండదు గాని శాసనాల ప్రభావం లోటుబాటును సమీక్షించే హక్కు అధికారం ఉన్నత న్యాయస్థానాలకు వుంటుంది.అందులోనూ అమరావతి రైతుల సమస్య కూడా ఇమిడి వుంది గనక మానవీయ కోణం కూడా చూపొచ్చు. రాజ్యాంగ నిబంధలను న్యాయ సూత్రాల ప్రకారం తన నిర్ణయాన్ని విధానాన్ని కోర్టులో నెగ్గించుకోవసిన బాధ్యతరాష్ట్ర ప్రభుత్వం పై వుంటుంది.  హైకోర్టులో వరసగా చాలా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తున్నాయనే అసహనంతో ఈ హక్కును కాదంటే కుదరదు. ఈ నేపథ్యంలో హైకోర్టు రాజధాని రైతుల పిటిషన్లను స్వీకరిస్తూ యథాతథస్థితి స్టేటస్‌కో విధించింది. ఇది విధానాన్ని మార్చే ఆదేశం కాదు. ప్రభుత్వల కార్యకలాపానూ ఆపదు. భౌతికంగా అమరావతి నుంచి మూడు  కీలక పాలనా కేంద్రాలను తరలించకుండా చేయడమే జరుగుతుంది.  ఈ ఉత్తర్వు కూడా మొదటి విచారణలో ప్రభుత్వ న్యాయవాదు వాదించిన తీరునుంచి ఉత్పన్నమైనాయి. స్టేటస్‌ కో అన్నది సమస్యే కానట్టు, అతి  త్వరలో తొలిగిపోవచ్చన్నట్టు పాలక పక్ష నాయకులు మాట్లాడారు. అలా అంటూనే  సుప్రీంలో పిటిషన్‌ వేశారు.


     పిటిషన్‌ విచారణ క్రమంలో మొదట సిజె ఎస్‌ఎ బాబ్డే కుమార్తె రుక్మిణి రైతు తరపున హాజరయ్యారనే  కారణంగా ధర్మాసనం మారింది. తర్వాత కూడా రోహట్టన్‌ నారీమన్‌ తండ్రి ఫాలీ వి నారీమన్‌  ఈ కేసులో వాదించవచ్చుననే కారణంగా మూడో ధర్మాసనం వచ్చింది. ఈ నాట్‌ బిఫోర్‌ నాటకమని వైసీపీ  నేతలు వాదించారు గాని దానివల్ల పెద్ద ప్రయోజనం వుండదు. నిజంగానే ఈ రోజు సీనియర్‌ నారీమన్‌ రైతుల తరపున హాజరైనారు. ధర్మాసనా మార్పు వల్ల ఆలస్యం అయివుండొచ్చు గాని హైకోర్టు ఇంకా విచారణ మొదలు పెట్టకుండానే సుప్రీం కోర్టు స్టేటస్‌కో ఎత్తివేసే అవకాశం చాలా తక్కువ. రాజ్యాంగం నాల్గవ అధ్యాయం అయిదవ భాగంలో ఆర్టికిల్‌ 214 ప్రకారం హైకోర్టు కూడారాజ్యాంగ తీర్పులు ఇస్తాయి. వాటిని అవసరమైతే సుప్రీం కోర్టు సమీక్షించి తుది తీర్పుఇవ్వొచ్చు. కనుక సుప్రీం కోర్టు ప్రతి సందర్భంలోనూ జోక్యం చేసుకుంటుందని ఆశించలేము. నిజంగానే ఈ రోజు ముచ్చటగా మూడో ధర్మాసనం  ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు లోతుగా పరిశీలించిన చెప్పిన తర్వాత అవసరమైతే  అప్పుడు చూస్తామని చెప్పింది. దీనివల్ల రాజధానితరలింపు ఆలస్యమవుతుందని అన్నీ నిలిచిపోతాయని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలనూ తోసిపుచ్చింది. ఒకవేళ తుది తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు తరలింపు ఖర్చుఎవరు భరిస్తారని  గతంలో ఒకసారి  హైకోర్టు వేసిన ప్రశ్ననే వేసింది.దీనికి నిజంగానే సమాధానం లేకపోవడం ఒకటైతే ఇందులో ఇతర సంకేతాలను కూడా విస్మరించరాని రాష్ట్ర ప్రభుత్వం అర్ఠం చేసుకోకతప్పదు. 

          ఈ పరిస్థితులో రాజధాని సమస్యలో హైకోర్టు అభిప్రాయాలే ప్రాథమికం కాబోతున్నాయి.హైకోర్టు విచారణ ముగించడానికి గడువు విధించలేమంటూనే రోజువారి విచారణ జరిపి త్వరగా ముగించమని మాత్రం సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఇది సాధారణ తరహాలో వున్నదే గాని ప్రత్యేకమని చెప్పలేము. బహుశా వాద ప్రతివాదలు కౌంటర్లు తీసుకోవడం పరిశీలించడం ప్రత్యక్ష వాదోపవాదాలు ఇవన్నీ  సమయం తీసుకుంటాయి. కరోనా పరిస్తితులే గాక ఇతర అంశాల పై కూడా ప్రభావం చూపించవచ్చు.  అప్పుడు తుది తీర్పు ఎలా వుంటుంది దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లవలసి వస్తుందా.. వెళితే అక్కడ ఎంత సమయం పడుతుంది.ఈలోగా ప్రభుత్వం ఏదైనా చర్యకు పాల్పడితే హైకోర్టు  స్పందించవచ్చు.ఇవన్నీ  లెక్కలోకి తీసుకుంటే  రాష్ట్ర ప్రభుత్వం  కొద్ది మాసాల పాటు నిరీక్షించడం అనివార్యమే. రాజకీయ చర్చ పాలనా వ్యవస్థ దీనిచుట్టే పరిభ్రమిస్తూ వుంటాయి. రాజకీయ వాదోపవాదాలు ఉద్యమాలు ఉద్రేకాలు  ఎలా వున్నా  ప్రతిష్టంభన కొనసాగుతుంది. న్యాయస్థానాలు  రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సముచిత పరిష్కారం చూపిస్తాయని ఆశించాలి. ఈ సమయాన్ని కూడా సానుకూలంగా తీసుకుని ప్రభుత్వం అమరావతి రైతులతో ప్రజలతో చర్చ ప్రక్రియ నడిపి ప్రజాస్వామిక స్పూర్తి ప్రదర్శించాలి.