ప్రపంచం మెచ్చిన సత్యజిత్ రే...!

ప్రపంచం మెచ్చిన సత్యజిత్ రే...!

భారతదేశంలో విశ్వవిఖ్యాత దర్శకసార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యజిత్ రే మాత్రమేనని అందరూ అంగీకరిస్తారు. సత్యజిత్ రే సినిమాలతోనే భారతీయ ఆత్మ దేశవిదేశాల్లోని సినీప్రియులను ఆకట్టుకుంది. 'రే' పేరులో వెలుగు రేఖ ఉన్నట్టే, ఆయన ప్రతిభాపాటవాల కారణంగానే భారతీయ సినిమా ప్రపంచ యవనికపై వెలుగు చూసింది. ఏం, అంతకు ముందు సత్యజిత్ రే కంటే మించిన దర్శకులు లేరా? అంటే నిస్సందేహంగా లేరనే చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో దర్శకులు అఖండ విజయాలను సాధించారు. అయితే వారి చిత్రాలలో కనిపించిన బాణీ అంతర్జాతీయ విలువలకు అంతగా తూగలేదు. అందువల్లే సత్యజిత్ రే రాకతోనే భారతీయ సినిమా సైతం అంతర్జాతీయంగా ఆకట్టుకోగలదని నిరూపితమయింది.  సత్యజిత్ రే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత దర్శకులెందరికో అమిత గౌరవం. 

సత్యజిత్ రే కు సినిమా అంటే ప్రాణం. ఆయన వంశంలో అందరూ కళాకారులే. ముఖ్యంగా చిత్రలేఖనంలో చేయి తిరిగిన వారు. సత్యజిత్ రేకు కూడా చిత్రలేఖనంలో ఎంతో ప్రావీణ్యం ఉంది. శాంతినికేతన్ లో అధ్యయనం చేయడం వల్ల సత్యజిత్ రే కు లలితకళల పట్ల మరింత ఆసక్తి పెరిగింది.  ఆర్ట్ తోనే ఆయన జీవితం ఆరంభమయింది. ఆ నాడు కలకత్తాలో ప్రచురితమైన పలు పత్రికలలో రే రేఖాచిత్రాలు ఆబాలగోపాలాన్నీ అలరించాయి. పాశ్చాత్య చిత్రాలను చూసి, సినిమాలపై మోజు పెంచుకున్న సత్యజిత్ రే, తన మిత్రులతో కలసి కలకత్తాలో ఫిలిమ్ సొసైటీ ఏర్పాటు చేశారు. అదే సంస్కృతి తరువాతి రోజుల్లో ఇతర రాష్ట్రాలలోనూ పెంపొందింది. ఎందరో పాశ్చాత్య దర్శకులను అధ్యయనం చేశారు రే. యాడ్ ఏజెన్సీలో పనిచేసే రోజుల్లో తప్పకుండా ఏదో ఒక సినిమా చూసేవారు. ఇక విదేశాలకు వెళ్ళినప్పుడు రోజుకో సినిమా చూశారు. వాటి స్ఫూర్తితోనే స్వదేశం రాగానే 'పథేర్ పాంచాలి'కి రూపకల్పన చేశారు. ఆ సినిమా పలు పాట్లు ఎదుర్కొని చివరకు బెంగాల్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో 'పథేర్ పాంచాలి' వెలుగు చూసింది. రాగానే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలచింది. పలు విదేశీ వేదికలపైనా ఉత్తమ చిత్రంగా గెలిచింది. ఆ తరువాత రే రూపొందించిన మరో రెండు చిత్రాలతో 'అప్పు ట్రయాలజీ' అంతర్జాతీయ సినిమా అభిమానుల విశేషాదరణ చూరగొంది. అప్పటి నుంచీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎందరో దర్శకులు ఈ సారి సత్యజిత్ రే నుండి ఏ సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే ప్రతీసారి సత్యజిత్ రే అంతర్జాతీయ యవనికపై వెలుగులు విరజిమ్మే చిత్రాలనే అందించేవారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకుంటున్న హాలీవుడ్ డైరెక్టర్ క్రిష్టఫర్ నోలాన్, గ్రాఫిక్ మాయాజాలంతో యావత్ ప్రపంచాన్నీ తమవైపు తిప్పుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్, జార్జ్ లుకాస్, 'గాడ్ ఫాదర్' సీరిస్ తో సినీఫ్యాన్స్ ను విశేషంగా మురిపించిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, విఖ్యాత సంచలన దర్శకుడు మార్టిన్ స్కార్సెసే వంటి వారందరూ తాము సత్యజిత్ రే సినిమాలతో స్ఫూర్తి చెందామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇక సత్యజిత్ రే సమకాలికులైన విఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా, "రే చిత్రాలను చూడనివారు సూర్యుని కింద ఉండీ ఫలితం లేనివారే" అని శ్లాఘించారు. దీనిని బట్టే ప్రపంచ వ్యాప్తంగా సత్యజిత్ రేకు ఉన్న కీర్తి ఏ పాటిదో అర్థమవుతుంది. నవతరం దర్శకులు సైతం సత్యజిత్ రే చూపిన బాటలో సాగుతూనే ఉన్నారు. సత్యజిత్ రే శతజయంతిని ఎంతో ఘనంగా జరపవలసిన పని. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా రే శతజయంతి ఉత్సవాలు సాగడం లేదు. కానీ, ఆయన అభిమానుల మదిలో అంతకంటే ఘనంగా సత్యజిత్ రేను స్మరించుకుంటూ ఉంటారని చెప్పవచ్చు.