బీజేపీ, జనసేన లేఖలపై సోషల్ మీడియాలో సెటైర్లు

బీజేపీ, జనసేన లేఖలపై సోషల్ మీడియాలో సెటైర్లు

సమయం వచ్చినపుడు సత్తా చూపాలి.
చేయిదాటాక ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం  ఉండదు.
తిరుపతి కార్పొరేషన్‌ లో ఇప్పుడవే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.
గతంలో నామినేషన్‌ వేయలేని పార్టీలు, ఇప్పుడు తమకు అవకాశం వస్తే... అనటంపై సెటైర్లు నడుస్తున్నాయట.

రాష్ట్రంలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాలలోకి మారుతోంది. అయితే ఎన్నికల కమీషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడ నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దాదాపు 15 సంవత్సరాల ఎన్నికలు జరగబోతున్నాయి. 2007లో చివరసారిగా పురపోరు నగరంలో జరిగింది. అప్పటి నుండి  వివిధ కారణాలతో అధికారుల పాలనలోనే కొనసాగుతోంది.

గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. కానీ, బిజెపి, జనసేన మాత్రం నిరాశలో పడ్డాయట. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖల మీదా లేఖలు రాస్తున్నాయట. ఇప్పుడు అవకాశం ఇస్తే, ఎన్నికలలో సత్తా చూపుతామని రెండు పార్టీల నేతలు స్థానికంగా చెప్పకుంటున్నారట. గత ఏడాది నగరంలోని యాభై వార్డులకు అభ్యర్థులను నిలపటంలో విఫలమైన బిజెపి, జనసేన ఇప్పుడు అవకాశం ఇస్తే అనటంపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారట.

గతంలో  రెండు, మూడు చోట్ల కూడా నామినేషన్లు వేయలేని పార్టీలు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాయంటున్నారట. దీనిపై సోషల్‌ మీడియాలో సెటైర్‌ పోస్టులు నడుస్తున్నాయట. ఇటు తెలుగు తమ్ముళ్ళు సైతం... కొత్త నోటిఫికేషన్ కావాలి అనే ముందు....గతంలో  ఎందుకు నామినేషన్లు కూడా వేయలేదో అని ప్రశ్నిస్తున్నారట. ఆడలేక మద్దెల ఓడన్నట్టు, బిజెపి జనసేన పార్టీల తీరు ఉందని స్థానికంగా చర్చ జరుగుతోందట.