ఖమ్మం పోలీసులకు షాక్ ఇచ్చిన ఇసుక ట్రాక్టర్...

ఖమ్మం పోలీసులకు షాక్ ఇచ్చిన ఇసుక ట్రాక్టర్...

ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు ఓ ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. రాత్రికి రాత్రి ఆ ట్రాక్టర్‌ టైరు కాలిపోవడంతో పోలీసుల ఫీజులు ఎగిరిపోయాయట. మరో కంటికి తెలియకుండా కొత్త టైర్‌ బిగించారట. ఇప్పుడిదే ఖమ్మం జిల్లా పోలీసులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

మున్నేరు నుంచి ఇష్టానుసారంగా ఇసుక తరలింపు!

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని గంధసిరి గ్రామంలో ఇసుక రవాణా ఎక్కువ. ఈ ఊరిలో ఇంటికొక్క ట్రాక్టర్‌ ఉంటుంది. అందరూ ఇసుక వ్యాపారమే చేస్తారు. ఇందుకోసం మున్నేరు నుంచి ఇష్టానుసార ఇసుక తోడేస్తారనే విమర్శలు ఉన్నాయి. నిజానికి మున్నేరులో ఇసుక ర్యాంప్‌ లేదు. అంతా అనధికారికంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ సమస్యపై గతంలో CPM పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇక్కడ నుంచి ఇసుక తరలింపును వ్యతిరేకిస్తున్నారు. 

గప్‌చుప్‌గా కొత్త టైర్‌ తీసుకొచ్చి బిగించేశారు!

ఇసుక రవాణాపై చూసీ చూడనట్టు ఉండే ముదిగొండ పోలీసులు ఈ విమర్శలు.. ఆరోపణల నుంచి గట్టెక్కడానికి అడపా దడపా కేసులు పెడుతూ ఉంటారు. అలా ఆ మధ్య 30 ట్రాక్టర్లను పట్టుకుని కేసు పెట్టారట పోలీసులు. ఆ ట్రాక్టర్లలో కాంగ్రెస్‌ కార్యకర్తకు చెందిన ఓ ట్రాక్టర్‌ ఉందట. ఏమైందో ఏమో కానీ.. ఆ ట్రాక్టర్‌ టైర్‌ ఒకటి అర్ధరాత్రివేళ కాలిపోయింది. విషయం తెలిసిన పోలీసులు కంగారుపడ్డారట. గప్‌చుప్‌గా కొత్త టైర్‌ తీసుకొచ్చి వేయించేశారట. 

కొత్త టైర్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది?

ఎంత రహస్యంగా టైర్‌ మార్చినా.. ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటకొచ్చేసింది. దీంతో  ఆ ట్రాక్టర్ టైర్‌ ఎలా దగ్దమైంది? ఎవరైనా కావాలని చేశారా? పోలీసులు ఎందుకు కంగారు పడ్డారు? ఎవరికీ చెప్పకుండా కొత్త టైర్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది? అంటూ రకరకాల ప్రశ్నలు ముసురుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఇదే పెద్ద చర్చగా మారిపోయింది. 

ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు భట్టి క్లాస్‌!

ఈ విషయం తెలుసుకున్న CLP నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ముదిగొండ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడున్న ట్రాక్టర్లను పరిశీలించారట. టైర్‌ ఎలా దగ్ధమైందని పోలీసులను ఆయన ప్రశ్నించారట. అయితే భట్టి విక్రమార్క రాక గురించి ముందే తెలుసుకున్న పోలీసులు.. ఇలాంటి ప్రశ్నలు ఏవో వస్తాయనే.. ఆయనకు ఘన స్వాగతం పలికారట.  దాంతో CLP నేత కొంత మెత్తబడినట్టు పోలీస్‌ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ... మల్లు భట్టివిక్రమార్క ఊరుకోలేదట. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు గట్టిగానే క్లాస్‌ పీకినట్టు సమాచారం. 

టైర్‌ దగ్ధం మిస్టరీగానే ఉండిపోతుందా? 

ఈ ప్రచారంతో రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్తాయని అనుకున్నారో ఏమో కాంగ్రెస్‌ కేడర్‌ మరో ప్రచారం మొదలుపెట్టిందట. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. ఈ అంశంపై మాట్లాడేందుకు భట్టి స్టేషన్‌కు వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. ట్రాక్టర్‌ టైర్‌ ఎలా దగ్ధమైందో ఎవరూ చెప్పడం లేదు. టైర్‌ దగ్దం కాగానే ఆ స్థాయిలో పోలీసులు ఉలిక్కి పడటానికి కారణం కూడా చెప్పడం లేదట. మరి.. ఈ ఘటన మిస్టరీగానే ఉండిపోతుందో లేదో చూడాలి.