రివ్యూ : కొబ్బరి మట్ట

 రివ్యూ : కొబ్బరి మట్ట

నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, ఇషికా సింగ్‌, షకీలా, మహేశ్‌కత్తి, గాయత్రి గుప్త తదితరులు
సంగీతం: సయీద్‌ కర్మాన్‌
సినిమాటోగ్రఫీ: ముజీర్‌ మాలిక్‌
ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత: సాయి రాజేశ్‌ నీలం అలియాస్ స్టీవెన్ శంకర్ 
దర్శకత్వం: రూపక్‌ రొనాల్డ్‌సన్‌ అలియాస్ శ్రావణ్ కొంకా 

అసలు హీరోకి కావాల్సిన క్వాలిటీలలో ఒక్క క్వాలిటీ కూడా లేకుండా హృదయ కాలేయం చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ బాబు చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ కొబ్బరిమట్ట అనే సెటైరికల్ సినిమాతో మనముందుకు వచ్చాడు. ఈ కొబ్బరిమట్ట సినిమా ఎలా ఉంది ? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా నచ్చకపోతే ఇక సినిమాలే మానేస్తానని చెప్పిన సంపూ కాన్ఫిడెన్స్ ఎంతవరకూ నిజమయ్యింది. అనేది చూడాలంటే రివ్యూ చూడాల్సిందే.

కధ :
పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) ఫ్యామిలీ తరతరాలుగా ఊరికి పెద్ద దిక్కుగా ఉంటుంది. ఊరి కోసం పాపారాయుడు చనిపోతూ తన కొడుకు పెదరాయుడ్ని కుటుంబానికి వారసుడ్ని ఊరికి పెద్దను చేస్తాడు. ఇక పెదరాయుడుకి ముగ్గరు తమ్మళ్లు, ముగ్గురు చెల్లెల్లు అలాగే భార్యలు కూడా ముగ్గురే. ఈ కుటుంబాన్ని అంతా ‘కొబ్బరి మట్ట’కు ఉండే ఆకుల్లా కాపాడుకుంటూ వస్తున్న సమయంలో ఓ రోజు ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు) వచ్చి.. ‘నువ్వే నా తండ్రివి’ అంటూ పెదరాయుడు ముందుకు వస్తాడు. ఆండ్రాయుడు రాకతో పెదరాయుడు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇంతకీ ఈ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడుతో తనకున్న సంబంధం ఏమిటి? ఆండ్రాయుడు వచ్చాక పెదరాయుడు జీవితంలో ఏం జరిగింది? పాపారాయుడు (సంపూ)కీ వీళ్లకూ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే కథ.

విశ్లేషణ: 

విశ్లేషించేంత కధ కాదు ఇది, ఎందుకంటే అసలు కథలో ఎక్కడా ఎలాంటి లాజిక్కులూ ఉండవు. ప్రతీ సన్నివేశం నవ్వించడానికే కాబట్టి దానిలో లాజిక్స్ వెదకలేము. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలపై, అందులోని కొన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేని సన్నివేశాల మీద ఇదో సెటైర్‌ సినిమా. ఓ రకంగా చూస్తే అల్లరి నరేష్ సినిమా అయిన సుడిగాడులో స్ఫూఫ్‌లు పేర్చుకుంటూ పోయినట్టు, ఇందులో కొన్ని తెలుగు సినిమా సన్నివేశాల్ని పేరడీ చేసుకుంటూ వెళ్లారు. అందులో భాగంగా వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. ఇంకొన్ని చిరాకు తెప్పించాయి.  మొదటలో సంపూ విన్యాసాలు కామెడీ అనిపించి నవ్వించినా క్రమంగా అవన్నీ బోర్ కొట్టి చిరాకు తెప్పించాయి. అయితే ఒకటి మాత్రం అర్ధం అయింది, ఏమీ ఆశించకుండా సినిమాకి వెళితే మాత్రం కాసేపు నవ్వుకుని మరి కాసేపు చిరాకు పడి మిక్సడ్ ఎమోషన్స్ తో బయటకి వెళ్ళచ్చు. 


నటీనటుల పనితీరు: 

పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు భీబత్సంగా నటించారు. సీన్ సీన్‌‌లో పంచ్ వేస్తూ ఫన్ జనరేట్ చేస్తూ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాడు. వన్ మేన్ షో చేసి డాన్స్, ఫైట్లతో పొట్టచెక్కలు చేశాడు. అతనికి భార్యలుగా నటించిన గాయత్రి గుప్తా, ఇషికా సింగ్, గీతాంజలి కామెడీని భీబత్సంగా పండించారు. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది పండు(షకీలా), కాముడు(కత్తి మహేష్) పాత్రల గురించి. ఈ ఇద్దరూ భార్య భర్తలుగా నటించి కామెడీ పీక్స్ చేరేలా చేశారు. చాలా రోజుల తరువాత షకీలాకు తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ పడింది.కత్తి మహేష్ కూడా మొట్టమొదటి సారిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.  మిగతా నటీనటులు తమతమ పరిధి మేర బానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: 

రాజేష్ రాసిన డైలాగ్స్ బాగా పేలి ప్రేక్షకుల్ని నవ్వించాయి. నేపథ్య సంగీతంతో పాటు పాటలు కూడా అలరించేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు రోనాల్డ్ రూపక్ సన్ విషయానికి వస్తే కొబ్బరిమట్ట ని సెటైరికల్ కామెడీ కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చేలా తీర్చి దిద్దాడని చెప్పొచ్చు అయితే సంపూ కామెడీని ఇష్టపడని వాళ్లకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. అన్ని సినిమాలని స్పూఫ్ గా తీసుకొని తెరపైన ఓ పూర్తి స్థాయి వినోదాత్మక మైన సినిమాగా మలచడంలో దర్శకుడు రోనాల్డ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

పాజిటివ్ పాయింట్స్: 
సంపూ
కామెడీ 
డైలాగ్స్ 

మైనస్ పాయింట్స్: 
కథ, కథనాలు
మిగిలిన నటీనటులు
నవ్వించని కొన్ని కామెడీ సన్నివేశాలు 
 
చివరిగా: ఇది సంపూ మార్క్ పేరడీ సినిమా...