1984 విషాదంపై చర్చే లేదు, శామ్ పిట్రోడా ముమ్మాటికీ తప్పే

1984 విషాదంపై చర్చే లేదు, శామ్ పిట్రోడా ముమ్మాటికీ తప్పే

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని షుజాల్ పూర్ లో ఒక ఎన్నికల ర్యాలీ తర్వాత ఎన్డీటీవీ రవీష్ కుమార్ తో ముఖాముఖిలో పిట్రోడా అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని చెప్పారు. అదే విషయాన్ని ఆయనకు చెప్పినట్టు రాహుల్ తెలిపారు. ఎవరు హింసకు పాల్పడినా వారిని 100 శాతం శిక్షించాల్సిందేనని చెప్పారు. అంతకు తన ఫేస్ బుక్ లో సైతం శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ వైఖరికి పూర్తిగా స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అల్లర్లు దారుణ విషాదంగా పేర్కొన్న రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు.

నరేంద్ర మోడీ రాజీవ్ గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీలను ప్రస్తావించడంపై మాట్లాడుతూ తనకు వాళ్లందరి గురించి అన్ని నిజాలు తెలుసన్నారు రాహుల్ గాంధీ. మోడీ ప్రచారం చేస్తున్నవన్నీ అబద్ధాలని కూడా తనకు తెలుసని చెప్పారు. ప్రసంగాలు ఇవ్వడం, వ్యాఖ్యానాలు చేయడం మాత్రమే ప్రధానమంత్రి బాధ్యతని నరేంద్ర మోడీ భావిస్తున్నారని, కానీ వ్యూహాత్మకంగా ఆలోచించడం ప్రధాని బాధ్యతని తెలిపారు. మోడీ పనితీరులో ఒక వ్యూహం కొరవడిందని విమర్శించారు. తొమ్మిదేళ్లపాటు తాను, మన్మోహన్ సింగ్ ఎంతో కష్టపడి జమ్ముకశ్మీర్ లో పంచాయతీరాజ్ ను బలోపేతం చేసి మహిళలకు సాధికారత అందిస్తే అంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచారని రాహుల్ అన్నారు.

దేశాన్ని ఎలా పాలించకూడదో నరేంద్ర మోడీ చూపించారని విమర్శించారు. దేశంలో ఒకే పార్టీ అధికారం కోరుకుంటున్న ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్, ప్రగతివాద శక్తుల మధ్య పోరాటం సాగుతోందన్నారు. తాను వెళ్లిన ప్రతిచోట ప్రజలు తాము భయంతో బతుకుతున్నట్టు చెబుతున్నారని, భారత్ ను నియంత్రించేందుకు ఒక శక్తి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం నరేంద్ర మోడీని ఎవరూ ఓడించలేరని కొందరు చెప్పినప్పటికీ తాము వెనకడుగు వేయకుండా పార్లమెంట్ లో, క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు మోడీ తమను చూసి భయపడుతున్నారని, ఇవాళ నరేంద్ర మోడీ గెలుస్తారని ఎవరూ చెప్పడం లేదన్నారు.