విశాఖలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయండి : విజయసాయి రెడ్డి విజ్ఞప్తి !

విశాఖలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయండి : విజయసాయి రెడ్డి విజ్ఞప్తి !

విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ ఐటీ)ని ఏర్పాటు చేయాలని మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్‌ ఐటీ చట్టాల సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడిన విజయసాయు రెడ్డి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో పీపీపీ విధానంలో ఏర్పాటైన ట్రిపుల్‌ ఐటీ పని చేస్తోందని, దీంతో పాటు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి, త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో మరో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఉన్నత విద్యా సంస్థలను జాతీయ స్థాయు హోదా కల్పించడంతో పాటు, ఇప్పటికే ఏర్పాటైన అలాంటి సంస్థలకు అన్ని రకాల మౌలిక వసతులను త్వరితగతిన కల్పించే విషయంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. ఉదాహరణకు 2015లో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఐఐఎం ఇప్పటికీ ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌ నుంచే పని చేస్తుందని, ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయల కల్పనను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. అలాగే, అనంతపురంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ యూనివర్శిటీకి సైతం ఇప్పటి వరకు శాశ్వత భవనాల నిర్మాణం జరగనందున అనేక ఇబ్బందులతో తాత్కాలిక క్యాంపస్‌లోనే నెట్టుకొస్తోందని అన్నారు.

ట్రిపుల్‌ ఐఐటీల ద్వారా సాంకేతికంగా ప్రతిభ కలిగిన మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నది ఈ బిల్లు ఉద్దేశమని అయితే,  అత్యంత ఈ సంస్థల ద్వారా అందుబాటులోకి వచ్చే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళిపోకుండా దేశంలోనే వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వద్ద ఏవైనా ప్రణాళిక ఉందా..!? అని ప్రశ్నించారు. అలాగే, దేశంలో అత్యధికమంది విద్యార్ధులు ఐఐటీలో ప్రవేశం కోరుకుంటారని, ఆయా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన, పరిశోధన, ఫాకల్టీ, మౌలిక వసతులు అందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. ట్రిపుల్‌ ఐటీలలో కూడా అదే రకమైన ప్రమాణాలతో విద్యా బోధన, పరిశోధన, అత్యుత్తమ ఫాకల్టీ, వసతుల కల్పన ద్వారా ఐఐటీ స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి కోరారు.