తుమ్మలపై అసత్య ప్రచారానికి కారణం ఆ మంత్రేనా?

తుమ్మలపై అసత్య ప్రచారానికి కారణం ఆ మంత్రేనా?

అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ మాజీ మంత్రి వైపు అన్ని వర్గాలు మళ్లీ చూస్తున్నాయి. జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆయనంటే గిట్టని వర్గాలకు మాత్రం జరుగుతున్న పరిణామాలు రుచించలేదు. మాజీ మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను వాడేసుకోవడం మొదలుపెట్టాయి. ఇలాంటి ప్రచారాల వెనక ఓ మంత్రి ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఓ మంత్రి పాత్ర ఉందా? 

ఖమ్మం జిల్లా రాజకీయాలపై చర్చ వస్తే అందులో తప్పకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ్మల కంటూ ఒక గుర్తింపు..  అనుచరులు బలం దండిగానే ఉందనేది ఈ జిల్లాలో వినిపించే టాక్‌. 2018 ఎన్నికల్లో ఓడిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా ఉండిపోయారు తుమ్మల. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కొందరు రాజకీయాలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఓ మంత్రి చురుకుగా పనిచేశారన్నది పార్టీలో బహిరంగ రహస్యం. 

బలమైన వర్గం తుమ్మల వెంటే ఉందా? 

రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు.. జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. తుమ్మలను చురుకైన పాత్ర పోషించాలని అధికారపార్టీ పెద్దలు కోరడంతో రాజకీయ సందడి మొదలైంది. హెలికాప్టర్‌లో వచ్చిన ఇద్దరు మంత్రులు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన్ని తీసుకెళ్లారు. మాజీ మంత్రి పుట్టిన రోజు వేడుకలు సైతం జిల్లాలో ఓ రేంజ్‌లో నిర్వహించారు. జిల్లాలో బలమైన సామాజికవర్గం మొత్తం తుమ్మల వెంటే ఉందని చెప్పేలా కార్యక్రమాలు జరిగాయని అనుకుంటున్నారు. 

సోషల్‌ మీడియా ప్రచారంపై పోలీసులకు తుమ్మల ఫిర్యాదు!
ఓ మంత్రిని ఉద్దేశించే కామెంట్స్‌ చేశారా? 

జిల్లా రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలోనే తుమ్మలపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు కలకలం రేపాయి. మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పోస్టుల్లో ఊదరగొట్టారు. ఇదంతా టీఆర్‌ఎస్‌లోని తుమ్మల ప్రత్యర్థుల వర్గం పనిగా అనుమానిస్తున్నారట. ఈ ప్రచారాన్ని తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు.  ఈ పోస్టింగ్‌లకు కారణమైనవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారాయన. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు చేసిన కామెంట్స్‌పై పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో కొందరికి ఒక్కసారిగా అయాచితంగా పదవులు వచ్చాయని.. వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ మంత్రిని ఉద్దేశించే తుమ్మల ఈ కామెంట్స్‌ చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

వ్యతిరేక ప్రచారాన్ని లైట్‌గా తీసుకోవట్లేదా? 

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొందరు టీఆర్‌ఎస్‌ నేతల పేర్లు ప్రస్తావించడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్నా.. ఇలాంటి విషయాలను మాత్రం తుమ్మల నాగేశ్వరరావు లైట్‌ తీసుకోబోరని ఆయన వర్గం భావిస్తోంది. పార్టీ పెద్దలు సైతం ఇక్కడి పరిణామాలపై ఆరా తీస్తున్నారట. మరి.. ఖమ్మం ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.