రివ్యూ: రూలర్

రివ్యూ: రూలర్

నటీనటులు: బాలకృష్ణ, సోనాలి చౌహన్, వేదిక, జయసుధ, ప్రకాష్ రాజ్, భూమిక, సాయాజీ షిండే తదితరులు 

మ్యూజిక్: చిరంతన్ భట్ 

సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్ 

నిర్మాత: సి కళ్యాణ్ 

దర్శకత్వం: కేఎస్ రవికుమార్ 

బాలకృష్ణ 105 వ సినిమా రూలర్.  ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ ప్లే చేశారు.  ఇందులో ఒక రోల్ మోడ్రన్ గా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఈ మూవీ కోసం బాలయ్య దాదాపుగా 9 కిలోలు బరువు తగ్గారు.  ఎన్టీఆర్ బయోపిక్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుండా లేదా ఇప్పుడు చూద్దాం.  

కథ: 

జయసుధ ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉంటుంది.  ఓసారి అనుకోకుండా బాలకృష్ణ ఆమెకు కనిపిస్తాడు.  ఆమె బాలయ్యను పెంచి పెద్ద చేసి తన కంపెనీ బాధ్యతలు అప్పగిస్తుంది.  బాలకృష్ణ (అర్జున్ ప్రసాద్) కంపెనీని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాడు.  అదే సమయంలో అర్జున్ ప్రసాద్ కంపెనీకి ఉత్తరప్రదేశ్ నుంచి ఓ ఆర్డర్ వస్తుంది.  అయితే, ఉత్తరప్రదేశ్ లో కంపెనీ కార్యకలాపాలు చేపట్టొద్దని అంటుంది.  గతంలో ఉత్తర ప్రదేశ్ లో తనకు జరిగిన అవమానం గురించి చెప్తుంది.  అది విని షాకైన అర్జున్ ప్రసాద్.. తన తల్లి జయసుధకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకొవాడానికి పంతంతో ఉత్తరప్రదేశ్ వెళ్తాడు.  అలా యూపీ వెళ్లిన బాలయ్యను చూసి అందరు ధర్మ అని పిలుస్తుంటారు.  అసలు ధర్మ ఎవరు..? ధర్మకు యూపీ మంత్రికి సంబంధం ఏంటి? జయసుధకు జరిగిన అవమానం ఏంటి అన్నది మిగతా కథ 

విశ్లేషణ: 

బాలకృష్ణ సినిమా అంటే ఫ్యాన్స్ ఆశించేది భారీ డైలాగులు, డ్యాన్స్, ఫైట్స్.. వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  ఈ సినిమాలో కూడా బాలయ్య అదే చేశారు. కథాపరంగా చూసుకుంటే రొటీన్ కథ అని చెప్పాలి.  ఇలాంటి కథలతో గతంలో బాలకృష్ణనే చాలా సినిమాలు చేశారు.  కానీ, డైలాగులు, మాస్ ఎలిమెంట్స్ ను బేస్ చేసుకొని ఈ కథతో సినిమా చేయడం సాహసం అని చెప్పాలి.  జైసింహా కూడా ఇలానే ఉంటుంది.  మరలా అదే ఫార్ములాను నమ్ముకొని సినిమాను చేశారు.  గతం మర్చిపోయిన బాలకృష్ణను చేరదీసి కంపెనీకి సీఈవోను చేస్తుంది. ఆ తరువాత తల్లి కోసం యూపీ వచ్చిన బాలయ్య అక్కడ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.. సోనాలి చౌహన్ తో ప్రేమలో ఎలా పడ్డాడు అన్నది ఫస్ట్ హాఫ్ కథ.  కథలో మెరుపులు ఉండవు.  సాదాసీదాగా సాగిపోతుంది.  ఫస్ట్ హాఫ్ లో సాగతీత ఎక్కువగా కనిపిస్తుంది.  

ఇక సెకండ్ హాఫ్ లో వేదిక ఎంట్రీ తో సినిమా కొంచం స్పీడ్ పెరిగింది.  ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో జోష్ పెంచుతుంది.  రైతు సమస్యలు, పరువు హత్యలు, తెలుగు వారి ఇబ్బందులు వంటివి సెకండ్ హాఫ్ లో చూపించి మెప్పించే ప్రయత్నం చేశారు.  సెకండ్ హాఫ్ లో వచ్చిన పోలీస్ పాత్రలో బాలయ్య మాస్ గా మెప్పించారు.  అయితే విగ్ సెట్ కాలేదు.  ఇదే సినిమాకు మైనస్ అయ్యింది.  గతం మర్చిపోయిన అర్జున్ ప్రసాద్ ఎవరు అని తెలుసుకోవడంతో క్లైమాక్స్ కు చేరుకుంటుంది.  అన్ని సినిమాల్లాగే భారీ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది.  మాస్ ను మెప్పించే అంశాలు తప్పించి కథలో కొత్తదనం లేకపోవడంతో దర్శకుడు కూడా పెద్దగా సాహసాలు చేయలేకపోయాడని చెప్పాలి.  

నటీనటుల పనితీరు: 

రెండు పాత్రల్లో బాలకృష్ణ కనబరిచిన నటన సినిమాకు ప్లస్ అయ్యింది.  ఫస్ట్ హాఫ్ లో కంపెనీ సీఈవోగా స్టైలిష్ గా మెప్పించాడు.  బరువు తగ్గి సినిమాకోసం స్టైలిష్ గా మారిపోయాడు.  ఫస్ట్ హాఫ్ లో బాలయ్య స్టెప్స్ కూడా ఆకట్టుకుంటాయి.  సెకండ్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.  డైలాగులతో సినిమా దుమ్ముదులిపేశాడు.  ఇద్దరు హీరోయిన్లు అందంగా కనిపించి స్క్రీన్ పై సందడి చేశారు.  మిగతా పాత్రలు పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

పరుచూరి మురళి ఇచ్చిన కథ పాతగా ఉండటంతో దర్శకుడు కెఎస్ రవి కుమార్ పెద్దగా మార్పులు చేయలేకపోయారు.  రవికుమార్ సినిమాలో కనిపించే ట్విస్ట్ లు ఈ సినిమాలో కనిపించలేదు. సినిమాను సాదాసీదాగా తీసేశారు.  జైసింహా లాంటి సినిమా అవుతుంది అనుకున్నా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.  సినిమాలో సాంగ్స్ కంటే నేపధ్య సంగీతం ఆకట్టుకుంది.  రామ్ ప్రసాద్ కెమెరాపనితనం బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్: 

బాలకృష్ణ 

కొత్త స్టెప్స్ 

ఫైట్స్ 

మైనస్ పాయింట్స్: 

కథ 

కథనం 

కామెడీ ట్రాక్ 

చివరిగా: రూలర్: అభిమానులకు మాత్రమే...