వ్యవసాయ చట్టాలు.. ఘాటుగా స్పందించిన ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత..

వ్యవసాయ చట్టాలు.. ఘాటుగా స్పందించిన ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత..

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఎంత మేలు చేస్తాయన్నది పక్కన బెడితే.. రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది.. దాంతో.. ఆ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆందోళనకు దిగారు.. వారిని ఎన్నిరకాలుగా విచ్ఛిన్నం చేయాలని చూసినా.. వెన్ను చూపకుండా పోరాటం చేస్తున్నారు. మరోవైపు.. వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం అంటోంది.. తాత్కాలికంగా వాయిదా వేసిన అమలు చేస్తామంటోంది. ఇక, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వస్తున్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. అయితే, రైతుల ఆందోళన, నరేంద్ర సింగ్ తోమర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్‌ఎస్ఎస్ సీనియర్‌ నేత రఘునందన్‌ శర్మ. 

తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో స్పందించిన రఘునందన్ శర్మ.. మీ ఉద్దేశం రైతులకు మేలు చేసేదే అయినా.. కొందరు ఈ సాయాన్ని కోరుకోకపోవడం వల్ల అలాంటి మంచి పనిచేసి ఏం లాభం ఉంటుందని ఫేస్‌బుక్‌లో ప్రశ్నించిన ఆయన.. కొందరు నగ్నంగా ఉండాలని కోరుకునే వారిపై బలవంతంగా వస్త్రాన్ని కప్పితే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. తోమర్‌ను టార్గెట్ చేసిన ఆర్ఎస్ఎస్ నేత... వ్యవసాయ మంత్రి తోమర్‌కు అహంకారం తలకెక్కిందంటూ ఫైర్ అయ్యారు.. ప్రజాభిప్రాయాన్ని కాలరాసి కాలం చెల్లిన కాంగ్రెస్‌ విధానాలను ఎందుకు ముందుకు తెస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయతను బలోపేతం చేయడానికి అన్ని శక్తులను ఉపయోగించుకోండి, మా సూచనలు మీరు స్వీకరిస్తారని భావిస్తున్నాను అంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన.. బీజేపీ నుంచి గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు..