అగ్రిగోల్డ్‌కు రూ.4వేల కోట్ల ఆఫర్...
అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను టేకోవర్ చేసుకోవడానికి రూ. 4 వేల కోట్లు ఆఫర్ చేసింది సుభాష్ చంద్ర ఫౌండేషన్... ఇప్పటికే ఓ సారి ఆసక్తి చూపించి వెనక్కి తగ్గిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ మరోసారి ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఐడీ అధికారులు ఇప్పటి వరకు అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను రూ. 4 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు నివేదించింది జీ గ్రూప్‌నకు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్. ఈ ప్రక్రియను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని, దశలవారీగా డిపాజిటర్లకు 4 సంవత్సరాల్లో డబ్బును చెల్లిస్తామని తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.2200 కోట్లుగా ఉందని... నాలుగేళ్లలో వీటి విలువ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రూ.4 వేల కోట్లుకు ఆస్తులను టేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
అయితే సుభాష్ చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, అగ్రిగోల్డ్ సంస్థ, బ్యాంకులు, పిటిషనర్లు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. అందరి అభిప్రాయాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇక అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను రూ.4 వేల కోట్లుగా లెక్కగట్టడం, నాలుగేళ్లు గడువు కోరడంపై తమకు అభ్యంతరం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎలా స్పందిస్తాయే మరి వేచిచూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)