గ్రేటర్‌కు ప్రతి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు

గ్రేటర్‌కు ప్రతి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు

గ్రేటర్ ఎన్నికల సమయంలో జీహెచ్‌ఎంసీకి గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రవు.. ఇకపై ప్రతి బడ్జెట్‌లో గ్రేటర్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదన్న కేసీఆర్.. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తామని తెలిపారు.. ఇక, సిటీలో ఉన్న పరిశ్రమలను తరలిస్తాం, కాలుష్యాన్ని తొలగిస్తామని.. మెట్రో రైల్‌ను పొడిగిస్తాం.. ఎయిర్‌పోర్టు వరకూ మెట్రో రైలును విస్తరిస్తామన్నారు తెలంగాణ సీఎం.. హైదరాబాద్‌ ఎలా పెరిగింది అనేదానిపై ఇప్పుడు చర్చ అవసరంలేదు.. కానీ, జరగాల్సిన పనులు చాలా ఉన్నాయన్న ఆయన.. కేంద్రానికి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో వరదలు రాని నగరం ఏదీ లేదన్నారు సీఎం కేసీఆర్... ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాలోనూ వరదలొచ్చాయని గుర్తు చేసిన ఆయన.. మా మంత్రులంతా మోకాళ్ల లోతు నీళ్లలో తిరిగారు. హైదరాబాద్‌లో వరదలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. పేదలకు సాయం చేయాలని వదరసాయం రూ.10 వేలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడా వరదసాయం ఇవ్వలేదన్న సీఎం... ఇక్కడ మాత్రం కిరికిరి పెడతారా? అంటూ మండిపడ్డారు.  లెటర్ రాస్తారు.. నేను రాయలేదని గందరగోళ పరిస్థితి సృష్టిస్తారు.. ఈసీని కూడా ఇబ్బంది పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.