వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష కోట్లు..

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష కోట్లు..

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను మూడోరోజు కూడా మీడియాకు వివరించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు ఈ నిధితో ప్రయోజనం కలుగుతుందని వివరించారు ఆర్థిక మంత్రి.. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ. 10 వేల కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రధాని చెప్పిన వోకల్ ఫర్‌ లోకల్‌ను సాకారం చేసే దిశగా ఈ కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి విపణులకు చేర్చేందుకు ఈ నిధితో సాయం చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. మత్స్య, డెయిరీ పరిశ్రమలకు ప్యాకేజీ.. ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు ప్యాకేజీ ప్రకటించారు. 

లాక్‌డౌన్‌ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందన్నారు ఆర్థికమంత్రి.. పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకొచ్చామన్న ఆయన.. లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించామని వెల్లడించారు.. 2 కోట్ల మంది పాడి రైతులకు రూ.5వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు అందిస్తామని.. సహకార రంగంలోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని తెలిపారు. ఇక, గడువు తీరిన 242 ఆక్వా హేచరీస్‌లకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలలు పొడిగించినట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు, ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ.10వేల కోట్లు కేటాయించామన్న ఆమె.. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా వేశారు ఆర్థికమంత్రి.