బెంగళూరు బోణి.. తొలిమ్యాచ్‌ చేజార్చుకున్న సన్‌రైజర్స్

బెంగళూరు బోణి.. తొలిమ్యాచ్‌ చేజార్చుకున్న సన్‌రైజర్స్

ఐపీఎల్‌లో బెంగళూరు బోణీ కొట్టింది.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 50కి పైగా రన్స్‌ కొట్టిన ఐదో ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించిన తర్వాత 56 రన్స్ వద్ద విజయ్ శంకర్ బౌలింగ్‌లో పడిక్కల్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్ తొలి బంతికే ఫించ్ కూడా వెనుదిరిగాడు. కాసేపటికే కోహ్లి 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ ఔటైనా డివిలియర్స్ దూకుడుగా ఆడి.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే రనౌట్ కావడంతో.. బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

ఇక, 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ అనూహ్య రీతిలో వార్నర్ వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో బెయిర్‌స్టో స్ట్రయిట్ షాట్ కొట్టగా.. బంతి బౌలర్ ఉమేశ్ యాదవ్ చేతి వేళ్లను తాకుతూ వికెట్లను తగిలింది. క్రీజ్ బయటకు వచ్చిన వార్నర్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత బెయిర్‌స్టోతో జత కలిసిన మనీష్ పాండే స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మొగ్గుతున్న దశలో చాహల్ మాయ చేశాడు. 12వ ఓవర్లో మనీష్ పాండేను ఔట్ చేసిన చాహల్.. మరుసటి ఓవర్లో బెయిర్‌స్టో , విజయ్ శంకర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. కాసేపటికే ప్రియమ్ గార్గ్ ఔట్ అయ్యాడు. 15 ఓవర్లలో 121/2తో పటిష్ట స్థితిలో ఉన్న సన్‌రైజర్స్.. చివరి 8 వికెట్లను 32 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకుంది. 19వ ఓవర్లో మిచెల్ మార్ష్ కుంటుతూనే బ్యాటింగ్ దిగినప్పటికీ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో ఓ బౌండరీ బాదిన సందీప్.. భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 153 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.