అమ్మాయిని ఏడిపించవద్దన్నాడని ఎస్సైనే కొట్టేశారు !

అమ్మాయిని ఏడిపించవద్దన్నాడని ఎస్సైనే కొట్టేశారు !

జనం మరీ దారుణంగా తయారు అవుతున్నారు. మామూలుగా ఎవరయినా తప్పు చేస్తున్నారంటే పోలీసులకి చెప్తామని అంటే తప్పు చేసే వాళ్ళు వెనక్కు తగ్గుతారు. కానీ ఇప్పుడు పోలీసుల మీద గౌరవం, భయం తగ్గిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారని తెలియడంతో అలా చేయడం తప్పని చెప్పడం ఆ పోలీస్ అధికారి తప్పయింది. ఆయన మీద దాడి చేశారు ఆ రౌడీ బ్యాచ్. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏఆర్ ఎస్సై వెంకటేష్ పై ఆకతాయిలు దాడి చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది.

మైనర్ యువతిని వేధించిన ఆకతాయిలను ఏఆర్ ఎస్సై మందలించడంతో రాట్నాల కుంటకు చెందిన కొంత మంది యువకులు ఆ ఏఆర్ ఎస్సై మీద ఎదురు దాడి చేశారు. దీంతో బాధిత యువతి, ఏఆర్ ఎస్సై వెంకటేష్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి అనుచరులు కావడంతో బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి లేదంటూ, త్రి టౌన్ పీఎస్ కు ఏఆర్ పోలీసులు భారీగా చేరుకుని ఆందోళన చేశారు.

మైనర్ బాలిక ను వేధించిన వారిని అలానే వారికి అడ్డుపడ్డ ఏ.ఆర్ ఎస్సై పై దాడి చేసిన వారు ఎంతటివారైనా శిక్షించాలని ఏ.ఆర్. సిబ్బంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు గెడ్డం నాగేంద్ర, ఏడుకొండలు మరో 9 మంది కలిపి దాడి చేసినట్లు గుర్తించి వారిపై ఫోక్సో యాక్ట్, 354 డి, 323 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.