టీ20ల్లో సరికొత్త రికార్డుకి చేరువలో ‘హిట్ మ్యాన్’

టీ20ల్లో సరికొత్త రికార్డుకి చేరువలో ‘హిట్ మ్యాన్’

పరిమిత ఓవర్ల జట్టులో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త టీ20 రికార్డు ముంగిట నిలిచాడు. ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో బ్యాటింగ్ భారమంతే హిట్ మ్యాన్ పైనే ఆధారపడి ఉంది. 31 ఏళ్ల రోహిత్ ఈ రెండు టీ20 మ్యాచ్ లలో రెండు సిక్సులు కొడితే పొట్టి క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాదిన మొదటి బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం 102 సిక్సులతో ఈ విధ్వంసక బ్యాట్స్ మెన్ మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గప్తిల్ (103), వెస్టిండీస్ సుడి గాలి.. క్రిస్ గేల్ (103) ఉన్నారు. చిట్టిపొట్టి క్రికెట్ లో 100కి పైగా సిక్సులు కొట్టిన మొనగాళ్లు రోహిత్, గప్తిల్, గేల్ మాత్రమే. టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన టాప్ 10 బ్యాట్స్ మెన్ జాబితాలో యువరాజ్ సింగ్ (74) కూడా ఉన్నాడు. 

కంగారూ జట్టుతో టీమిండియా విశాఖపట్నం, బెంగుళూరులలో రెండు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత రెండు జట్లు ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడతాయి. మొదటి వన్డే మార్చి 2న హైదరాబాద్ లో జరుగుతుంది.