మళ్ళీ పెరిగిన ముడి చమురు ధరలు

మళ్ళీ పెరిగిన ముడి చమురు ధరలు

ఒకవైపు ఇరాన్‌పై ఆంక్షలు అమలు చేయాల్సిన డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండా.. మరోవైపు ఒపెక్ దేశాల కామెంట్లు ఆయిల్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 80 డాలర్లకు చేరితే చాలని, తమకు సమ్మతమేనని సౌదీ అరేబియా ఇవాళ చేసిన ప్రకటనలతో క్రూడ్ ఆయిల్ ధరలు కొన్ని నిమిషాల్లో రెండు శాతం పెరిగాయి. నవంబర్ 4వ తేదీ నుంచి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఇరాన్‌ నుంచి ఆయిల్ కొనుగోళ్ళను ఆపేయాలని లేకుంటే తమ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని అమెరికా హెచ్చరించింది. దీంతో ఇరాన్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా చైనా, ఇండియా తమ కొనుగోళ్ళు భారీగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా చేసిన మరో ప్రకటన ఆయిల్ మార్కెట్‌ ఇన్వెస్టర్లను గందరగోళంలో పడేసింది. ఎన్ని రకాల ఆంక్షలు వేసినా.. ఒపెక్‌లో ఇరాన్‌ ఓ ప్రధాన దేశమని, ఆ విషయాన్ని విస్మరించలేమని అన్నారు. ఆ దేశ సరఫరా పట్టించుకోవాల్సిన అవసరముందని సౌదీ అంటోంది.

నిజంగానే ఇరాన్‌ ఆయిల్‌ సరఫరా పూర్తిగా నిలిపివేస్తే ఒపెక్‌లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఇరాన్‌ స్థానంలో ఎవరు సరఫరా పెంచాలనే అంతర్గత గొడవ కూడా ఒపెక్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి తాజా వివాదాలతో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ ధర 80 డాలర్లకు చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం 79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.