పాదయాత్ర ప్రభావంతో రెండుగా చీలిన కాంగ్రెస్...

పాదయాత్ర ప్రభావంతో రెండుగా చీలిన కాంగ్రెస్...

తెలంగాణ కాంగ్రెస్‌ రెండుగా చీలిందా? పాదయాత్రల ప్రభావంతో సీనియర్లు పక్కకి జరిగారా? రేవంత్‌ రెడ్డి యాత్ర టీ కాంగ్రెస్‌ పై ఎలాంటి ప్రభావం చూపింది?  ఇప్పుడే ఇలా ఉంటే, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తే ఏం జరుగుతుంది? 

తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్. పాదయాత్ర చేయడమే పెద్ద ఇష్యూ అంటే, పాదయాత్ర ముగింపు సభలో ఆయన చేసిన కామెంట్స్‌  తో మరో పెద్ద చర్చ. వీటన్నింటి కంటే రేవంత్ బల ప్రదర్శన చేసినట్లుంది అనే మరో టాక్ కూడా ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జూనియర్లంతా ఒక వైపు... సీనియర్లంతా ఇంకో వైపు నిలబడినట్టయిందనే టాక్‌  వినిపిస్తోంది.  రావిరాల పాదయాత్ర ముగింపు సమావేశంలో వేదిక మీద నాయకులను చూస్తే...ఇదే అనిపిస్తుంది.  పార్టీ అనుమతి లేదంటూ సీనియర్లు కామెంట్ చేస్తుంటే, వేదిక మీద జూనియర్ నాయకులతో పాటు మాజీమంత్రి షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, మాజీ ఎంపీలు, కొండా సురేఖ లాంటి నేతలంతా సభా వేదిక మీదే ఉన్నారు. 

అయితే సభ వేదిక మీద నుండి మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హీటెక్కించాయి. సీనియర్ నాయకులను ఆమె ఓ రేంజ్ లో కడిగేశారు.  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని చురకలు వేశారు.  ఇప్పుడు రేవంత్ పాదయాత్రకు బ్రేక్ లు వేయాలని అనుకున్నారు. కానీ రేవంత్ తెలంగాణ అంతా పాదయాత్ర చేయాలని ఆమె కోరారు. ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ ని సమర్దిస్తూనే రేవంత్ లాంటి మాస్ లీడర్ కావాలన్నట్టు ఆమె వాదించారు.

సభలో రేవంత్ కూడా అలాంటి దుకుడే ప్రదర్శించారు. పార్టీలో ఉన్న జూనియర్లతో పాటు... మెజారిటీ నాయకులను తన పాదయాత్ర ముగింపు వేదిక మీద ఉండేలా చూశారు.  సభకు చాలామంది నేతలు హాజరైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్, వీహెచ్‌ లాంటి వాళ్ళు డుమ్మా కొట్టారు. అయితే ఉత్తమ్ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు ముఖాముఖికి వెళ్లడం తో... సభకు రాలేక పోయారనే టాక్‌ ఉంది.

మొత్తానికి పాదయాత్రతో పార్టీ అధిష్ఠానానికి రేవంత్ తన బలాన్ని ప్రదర్శించినట్టైందనే టాక్‌ నడుస్తోంది. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరిని ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారనే టాక్‌ పెరుగుతోంది. అయితే పార్టీలో ఐదారుగురు లీడర్లు తప్పితే... మిగిలిన నాయకులు అంతా తనతోనే ఉన్నారని రేవంత్‌ చెప్పుకోగలిగారనే అభిప్రాయం కార్యకర్తలో ఉంది. దీనికి బలం చేకూరేలా... రాష్ట్రమంతా పాదయాత్ర  చేస్తానని ప్రకటన చేయడంతో మరింత చర్చకు దారి తీసింది. మరోపక్క మార్చిలో పీసీసీ చీఫ్‌ అంశం తేలిపోతుందనే చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ అధిష్టానానికి ఓ సంకేతం పంపినట్టైందనే టాక్‌ ఉంది.