పోలీసులను కళ్లుగప్పి బైక్ పై వచ్చిన రేవంత్ రెడ్డి...అరెస్ట్

పోలీసులను కళ్లుగప్పి బైక్ పై వచ్చిన రేవంత్ రెడ్డి...అరెస్ట్


ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి ప్రగతిభవన్‌కు విడతల వారీగా వస్తున్నారు. ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కి వచ్చే క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అయితే, పోలీసులకు రేవంత్ రెడ్డి మాత్రం దొరకలేదు.

రేవంత్ రెడ్డి కోసం ఓ వైపు గాలింపు జరుగుతుండగా మరోవైపు వారి నుంచి తప్పించుకుని ఆయన బైక్ పై రయ్ మంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి బయలుదేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ఆయన ప్రగతి భవన్ దాకా వచ్చారు. ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.  బైక్ వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.