ముచ్చటైన మాటల మూట... ముళ్ళపూడి వెంకట రమణ

ముచ్చటైన మాటల మూట... ముళ్ళపూడి వెంకట రమణ

కలంతో చక్కిలిగింతలు పెట్టడం అంటే పెన్ను తీసుకు వచ్చి  గోకడం కాదు. కలం పలికించే పదాలతో చదువరి పెదాలపై నవ్వులు నాట్యం చేయాలి. ఆ పదాలను తలచుకున్న ప్రతీసారి కితకితలు పెట్టినట్టు నవ్వు లు పూయాలి. అలాంటి నవ్వుల పువ్వులు పూయించడంలో దిట్ట మన ముళ్ళపూడి వెంకటరమణ. బాల్యం నుంచీ రమణకు తెలిసింది రాయడమే. రాసిన ప్రతీసారి ఏదో కొత్తగా అనిపించేలా చేయాలని తపించేవారు. ఆ తపనలోనే తనకు తెలియకుండానే పలు ప్రయోగాలు చేస్తూ పకపకలు పంచారు రమణ. పలు ప్రతికలకు కథలు రాయడంలో చేయితిరిగిన తరువాత 'ఆంధ్రసచిత్ర వారపత్రిక'లో సంపాదక వర్గంలో పనిచేశారు. షరా మామూలే అన్నట్టు పలు పలుకుబడులు పట్టుకువచ్చి  పాఠకలోకానికి పరమానందం పంచారు. ఆ రోజుల్లో రమణరాతకు, బాపు గీతకు లంకె కుదిరి పలు వార పత్రికల్లో నవ్వులనావలు సాగాయి. ఓ సారి రాతకంటే గీత భలేగుందనిపించేది. మరోసారి గీతను మించిన రాత కనిపించేది. అందువల్ల రమణ రాత, బాపు గీతను వేరు చేసి చూడలేకపోయారు పాఠకులు. ఆ రోజుల్లో  వారిద్దరి మనసులో పలు పరదేశీ చిత్రాల ప్రభావం చోటు చేసుకుంది. సదరు చిత్రాల తీరున తెలుగువాతావరణానికి అనువుగా సినిమాలను రూపొందించాలని ఇద్దరూ కలలు కన్నారు. తమ కలల తీరంలోకి ముందుగా ముళ్ళపూడి అడుగు వేశారు. యన్టీఆర్ 'రక్తసంబంధం' చిత్రంతో రచయితగా పరిచయమయ్యారు రమణ. ఆ సినిమా విషాదాంతం. తమిళంలో అన్నాచెల్లెళ్ళ అనుబంధంతో రూపొంది ఘనవిజయం సాధించిన 'పాశమలర్' ఆ చిత్రానికి మాతృక. తమిళంలో కనిపించని నవ్వులను తెలుగులో భలేగా పూయించారు రమణ. ఇక సెంటిమెంట్ సీన్స్ లోనూ రమణరాత సాగిన తీరు తెలుగు ప్రేక్షకలోకం కంట తడిపుట్టేలా చేసింది. 'రక్తసంబంధం' సాధించిన ఘనవిజయంతో రమణకు పలు సినిమాలకు రాసే అవకాశాలు లభించాయి. యన్టీఆర్ హీరోగా రూపొందిన 'దాగుడుమూతలు' చిత్రానికి కథ అందించాక కథకునిగానూ మరింత పేరు దక్కింది. ఈయన కథతోనే రూపొందిన యన్టీఆర్ 'కథానాయకుడు' బంగారునందిని సొంతం చేసుకుంది. 

రాత... గీత... 
ముళ్ళపూడి రచనతో ముస్తాబయిన కొన్ని చిత్రాలకు బాపు ఆర్టిస్ట్ గానూ, పబ్లిసిటీలోనూ పనిచేశారు. మెల్లగా మిత్రులిద్దరికీ సినిమా నిర్మాణంపై పట్టు లభించింది. ఓ వైపు రమణ రచనలు చేస్తూనే ఉన్నారు. బాపు బొమ్మలు పత్రికల్లో ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇద్దరూ కలసి 'సాక్షి' కి తగిన బడ్జెట్ వేసి, నిర్మాతలకు నమ్మకం కుదిరేలా చేసి, ఆ సినిమాను తెరకెక్కించేశారు. తొలి ప్రయత్నంలోనే బాపు-రమణ జనం నాడిని ఇట్టే పట్టేశారు. ఆ తరువాత తమ కథల్లోకి దేవుళ్ళను తీసుకు వచ్చారు. మనుషులతో మాట్లాడించేశారు. నవ్వుల మాటునే సమస్యలకు తగ్గ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ తీసిన 'సంపూర్ణ రామాయణం', గీసిన 'ముత్యాలముగ్గు'లు జనానికి భలేగా నచ్చేశాయి. దాంతో బాపు తీతకు, రమణ రాతకు తెలుగునాట ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. 'సాక్షి'తో ఆరంభమైన బాపు-రమణ జోడీ చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం' దాకా సాగింది. బాపు-రమణ పేర్లలో ఏ ఒక్కటి విన్నా, మరొకటి చప్పున గుర్తుకు రాకమానదు. శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటిగా మెలిగారు. స్నేహానికన్న మిన్న లోకాన ఏదీ లేదని చాటినవారు అరుదుగా కనిపిస్తారు. వారిలో బాపు-రమణ జోడీ అందరికంటే ముందుంటుంది. మరపురాని మాటల మూటలు అందించిన రమణను, మరచిపోలేని చిత్రలేఖనంతో పరవశింప చేసిన బాపును మననం చేసుకొనే కొద్దీ వారి చిత్రాల్లోని పాత్రలు మనలను పలకరిస్తూ పరవశింపచేస్తూనే ఉంటాయి. మరోమారు గుర్తు చేసుకోండి. ఆనందం మీ సొంతం కాకుంటే అడగండి!