జియో రైల్ యాప్ ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో

జియో రైల్ యాప్ ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో తన జియోఫోన్, జియోఫోన్ 2 వినియోగదారుల కోసం ‘జియోరైల్’ యాప్ ని లాంచ్ చేసింది. ఈ యాప్ తో వినియోగదారులు ఐఆర్సీటీసీ రైల్ టికెట్ బుకింగ్ సేవలను ఉపయోగిస్తూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. జియోరైల్ యాప్ జియోఫోన్, జియోఫోన్ 2 వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా విడుదల చేశారు. ఫీచర్ ఫోన్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకొనే సౌకర్యం కలగడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ యాప్ ని జియోఫోన్ యూజర్స్ జియో స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

జియోరైల్ యాప్ తో కలిగే లాభాలు
-స్మార్ట్ ఫోన్ కోసం తయారుచేసిన ఐఆర్సీటీసీ యాప్ మాదిరిగా జియోరైల్ యాప్ తో కూడా వినియోగదారులు తత్కాల్ బుకింగ్ చేయవచ్చు. జియోఫోన్ ఉన్న వినియోగదారులకు ఐఆర్సీటీసీ అకౌంట్ లేకపోతే ఈ యాప్ ద్వారా కొత్త అకౌంట్ ప్రారంభించవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ చేంజ్ అలర్ట్, ట్రెయిన్ లొకేటర్, ఫుడ్ ఆర్డర్ వంటి సేవలన్నిటినీ త్వరలోనే జియోరైల్ యాప్ లో తీసుకొచ్చే ప్రణాళికలో కంపెనీ ఉంది. జియోరైల్ యాప్ టికెట్ బుకింగ్ ని చాలా సులువుగా మార్చేయనుంది. జియోఫోన్ వినియోగదారులకు చాంతాడంత క్యూలలో నిలబడి, ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకొనే పాట్లు తప్పుతాయి.

-ఈ యాప్ ద్వారా వినియోగదారులు టికెట్ బుక్ చేయడంతో పాటు దానిని కేన్సిల్ కూడా చేసుకోవచ్చు. రైల్ టికెట్ చెల్లింపుల కోసం తమ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ-వాలెట్లను ఉపయోగించవచ్చు. ఇవి కాకుండా పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్, ట్రెయిన్ టైమింగ్, ట్రెయిన్ రూట్స్, సీట్ల లభ్యతల గురించి జియోరైల్  యాప్ ను ఉపయోగించి సమాచారం పొందగలుగుతారు.

రైల్వేల అఫీషియల్ సర్వీస్ ప్రొవైడర్ జియో 
రిలయన్స్ జియో, రైల్వేల అఫీషియల్ సర్వీస్ ప్రొవైడర్. రైల్వేలకి చెందిన 3.78 లక్షల అధికారులు-సిబ్బందికి తన సేవలు అందిస్తోంది. జియోకి ముందు భారతీ ఎయిర్ టెల్ రైల్వేలకు సేవలందించింది. కానీ 1 జనవరి 2019 నుంచి జియో ఈ సౌకర్యం అందజేస్తోంది. రైల్వే అధికారులు-సిబ్బందికి రిలయన్స్ జియో నాలుగు రకాల ప్లాన్లు అందిస్తోంది. వీటిలో అన్నిటి కంటే చౌకైన ప్లాన్ రూ.49 కాగా అత్యంత ఖరీదైన ప్లాన్ రూ.125. ఈ ప్లాన్ లో రైల్వే సిబ్బంది అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 4జి డేటా, ఎస్ఎంఎస్ సేవలు వాడుకోవచ్చు.