తెలంగాణ అంతా తిరుగుతా... ఉప్పెనలా కేసీఆర్ ని కమ్మేస్తా !

తెలంగాణ అంతా తిరుగుతా... ఉప్పెనలా  కేసీఆర్ ని కమ్మేస్తా !

కేంద్రం లాభాల్లో ఉన్న సంస్థలను అమ్ముతుంది... నష్టపోయిన ప్రయివేటు కంపెనీలను ఆదుకుంటుందని రేవంత్ అన్నారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ నేను రైతుని అని చెప్తాడని, మరి రైతుల వెంట మీరు ఎందుకు ఉండటం లేదని అయన ప్రశ్నించారు. రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులు తీసుకున్న అప్పులకు వడ్డీల కింద తీసుకుంటున్నారని,  మీరు చెప్పిన పంటనే వేసిన రైతులకు బోనస్ ఇవ్వండని అన్నారు. బ్రతికుండాలని రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా..రైతు చనిపోతే రైతు భీమా ఇస్తా అనడం సమంజసం కాదని రేవంత్ అన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుప్పగండ్ల లో 400 ఎకరాల గిరిజనుల భూములు తమవారి పేరు మీద బదిలీ చెయించుకున్నారని, తక్షణమే  ఆ భూములు గిరిజనులకు ఇవ్వాలని  లేదంటే..ఆ భూముల దగ్గరకు వెళ్తానని అన్నారు. 

కందుకూరు, కడ్తాల్ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని అయన అన్నారు. పల్లి.. బఠాన్లకు భూములు లాక్కొని... ప్రభుత్వం  కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటుందని రేవంత్ అన్నారు. వచ్చే రెండు..మూడేళ్లు కాంగ్రెస్ నినాదం..జై జవాన్..జై కిసాన్ అని,  జైజవాన్ నినాదంతో భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అయన అన్నారు. ఇంటికొకరు బయటకు రండి, లాల్ బహద్దూర్ శాస్త్రి నినాదం..మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చిందని రేవంత్ అన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిద్దామన్న ఆయన మనకు మనమే దిక్కని అన్నారు. మనకోసం ఎవరూ రారు, యువత ముందుకు రావాలని అన్నారు.

మోడీ చెప్పే అబద్దాలు ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని, . అబద్దాలు చెప్పడమే మోడీ పని,  మోడీ అబద్దాలు చెప్తుంటే...కిషన్ రెడ్డి నిజాలు చెప్తారా..? అని ప్రశ్నించారు.  కిషన్ రెడ్డి బిల్లులు పూర్తిగా చదివి ఉండడన్న రేవంత్ తెలంగాణ అంతా తిరుగుతా అందులో అనుమానం అవసరం లేదని అన్నారు.  ఉప్పెనలా తెలంగాణ ను కమ్మి... కేసీఆర్ ని కమ్మేస్తానని అన్నారు. ఏఐసీసీ అనుమతితోనే తెలంగాణలో తిరుగుతానన్న ఆయన ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు, అందరి పాదయాత్రకి కూడా వెళ్తానని అన్నారు. మా పార్టీ నాయకులు చేసే పాదయాత్రలకి వెళ్తానని, కాంగ్రెస్ జెండా కింద జరిగే ప్రతి కార్యక్రమానికి నేను వెళ్తానని అన్నారు.