భారీ వర్షం పడితే భాగ్యనగరం చిగురుటాకులా వణకాల్సిందేనా ?

భారీ వర్షం పడితే భాగ్యనగరం చిగురుటాకులా వణకాల్సిందేనా ?

జనం కష్టాలు పట్టించుకోరు... నిపుణుల సూచనల్ని లెక్కచేయరు... కమిటీల నివేదికల్ని బుట్టదాఖలు చేస్తారు... ఇదీ మన పాలకుల తీరు. అందుకే గట్టిగా వర్షం పడితే భాగ్యనగరం చిగురుటాకుల వణికిపోతోంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోడానికి కూడా పాలకుల నిర్లక్ష్యమే కారణం. మహానగరంలో ముంపు నివారణకు కమిటీల మీద కమిటీలను వేశారు.

కానీ వాటి నివేదికల ఆధారంగా నాలాల వ్యవస్థను సంస్కరించే పనిని ఏ ఒక్క ప్రభుత్వమూ చేపట్టిన పాపానికి పోలేదు. దీంతో ప్రతి సంవత్సరం రాజధాని నగరం జలవిలయంలో చిక్కుకుపోవడం పరిపాటిగావస్తోంది. కోటి మంది జనాభా ఉన్న రాజధానిలో నేటికీ నిజాం కాలంలో నిర్మించిన నాలాలే దిక్కు. కొన్ని చోట్ల అవి కూడా అక్రమణల వల్ల చిక్కిపోయాయి. నిజాం హాయంలో వంద అడుగుల వెడల్పుతో ప్రధాన నాలాలు నిర్మించగా...  ప్రస్తుతం చాలా చోట్ల ఆక్రమణల వల్ల పది-ఇరవై అడుగులకు తగ్గిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు గాని, విస్తరణకు గాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు పాలకులు.

2000 సంవత్సరంలో వరదల తర్వాత అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్‌ కమిటీ వేసింది. నాలాల సంస్కరణలపై నివేదిక ఇచ్చే బాధ్యతను అప్పగించింది. హైదరాబాద్‌ 12 వందల 21 కిలోమీటర్ల పొడవున నాలాలు ఉంటే... అందులో 390 కిలో మీటర్ల పొడువున మేజర్‌ నాలాలున్నాయి. ఈ కమిటీ 2003లో నివేదికను ఇచ్చింది. నాలాల మీద 28 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించి విస్తరణ పనులు చేపట్టడానికి పది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.

అయితే, అన్ని నిర్మాణాలను తొలగించడం సాధ్యం కాదని అప్పట్లోనే చేతులెత్తేశారు అధికారులు. దీంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. 2007లో మళ్లీ నాలాల సంస్కరణ అంశం తెరమీదకు వచ్చింది. నాలాల ఆధునీకరణకు తగిన సూచనలు చేయాల్సిన బాధ్యతను ఓయన్స్‌ సంస్థకు అప్పగించింది ప్రభుత్వం. ఈ కమిటీ కూడా క్లిరోస్కర్‌ తరహాలోనే నివేదిక ఇచ్చింది. దీంతో ఓయన్స్‌ నివేదిక కూడా బూజుపట్టిపోయింది.
 

హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధి, వర్షపు నీరు, మురుగు నీటి యాజమాన్యంపై రెండేళ్ల క్రితం JNTU నిపుణులు సమగ్ర నివేదిక ఇచ్చారు. నాలాలను విస్తరించడంతో పాటు వరదనీరు నగరంలోకి రాకుండా ఉండేందుకు కొన్నిచోట్ల కృత్రిమ చెరువులను తవ్వాలని సూచించారు నిపుణులు. అయితే, దీనికి 4 వేల 900 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, అది కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు... రెండేళ్ల క్రితమే ఇంజినీర్లతో కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం.

వరద నీరు సజావుగా వెళ్లకుండా అడ్డుపడుతున్న ప్రాంతాల్లో తక్షణమే ఆక్రమణలను తొలగించాలని ఆ కమిటీ తేల్చి చెప్పింది. 12 వేల 800 అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనికి 12 వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేసింది. మొదటి దశలో 230 కోట్ల రూపాయలతో కొన్ని కీలక ప్రాంతాల్లో అక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ అంతలోనే దీనికి బ్రేక్‌ పడింది. 20 శాతం పనులు మొదలయ్యే సరికే కొంత మంది స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. దీంతో నానాల విస్తరణ పనులు అటెకెక్కాయి.