ఆమంచి చీరాలకు చెల్లు చీటీ ఇవ్వాల్సిందేనా?
ఆ నియోజకవర్గం పేరు చెబితే మొదట గుర్తుకొచ్చేది ఆయనే. పైగా అధికార పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి నాయకుడిని అక్కడ నుంచి ఖాళీ చెయ్యాలని పార్టీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారట. పక్క నియోజకవర్గానికి వెళ్లాలని బుజ్జగిస్తున్నారట. మరి.. దీనికి ఆయన ఒప్పుకొంటారా?
చీరాలలో వైసీపీ పెద్దల ఆఫర్‌పై చర్చ!
ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ నేతల రాజకీయాలు వేడెక్కాయి. ఒకప్పుడు చీరాలలో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు ఒకే ఫ్యాన్ కిందకు చేరడంతో చీరాలలో ఆధిపత్యపోరుకు తెరలేచింది. ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం జగన్‌కు జై కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా అధికార పార్టీలోని నాయకులు ఎవరికివారుగా నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో వైసీపీ పెద్దలు చీరాల సమస్యపై ఫోకస్ పెట్టారట. ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.
2019లో కరణం బలరాం చేతిలో ఆమంచి ఓటమి!
చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 స్వతంత్ర ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలిచారు. తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు YCPలో చేరి అసెంబ్లీ టికెట్ సంపాదించినా టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓడినా ఆయనే పార్టీ ఇంఛార్జ్ కావడంతో.. నియోజకవర్గంలో ఆమంచి చెప్పిందే జరిగేది.
ఆమంచిని పర్చూరు వెళ్లమన్న పార్టీ పెద్దలు?
నాలుగు నెలల క్రితం చీరాల రాజకీయం మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్ సీఎం జగన్ పంచన చేరారు. ఒకప్పుడు కరణం, ఆమంచి ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉండేవారు. ఆ కారణంగా ఇద్దరు నేతల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇది పార్టీకి కీడు చేస్తుందని భావించారో ఏమో కానీ.. వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి ఆమంచి కృష్ణమోహన్‌కు ఓ కీలక సూచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చీరాల వదిలి.. పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గం వెళ్లాలని ఆమంచిపై ఒత్తిడి చేస్తున్నారట.
పర్చూరులో పార్టీ వ్యవహారాలు, అధికార కార్యక్రమాలు అప్పగిస్తారా?
పర్చూరు నియోజకవర్గంలో రావి రామనాథం బాబు ఇంఛార్జ్‌గా ఉన్నారు. అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అది వర్క్‌వుట్ కాలేదు. అందుకే చీరాలలో బలమైన నేతగా ఉన్న ఆమంచిని పర్చూరు వెళ్లమని బుజ్జగిస్తున్నారట. పర్చూరులో ప్రస్తుతం సరైన నేత లేక వైసీపీ బలపడటం లేదని.. అదే అక్కడి పార్టీ బాధ్యతలు చేపడితే అధికార వ్యవహారాలతోపాటు.. పార్టీ అంశాలు చక్కబెట్టవచ్చని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఆమంచి రాజకీయ భవిష్యత్ ఏంటి?
అయితే ఇప్పటి వరకూ తన కనుసన్నల్లో ఉన్న చీరాలను వదిలి పర్చూరుకు వెళ్లేందుకు ఆమంచి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. పర్చూరులో బలరామ్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆయన్నే అక్కడికి పంపాలని అధిష్ఠానం పెద్దలకు చెబుతున్నారట ఆమంచి. కానీ.. ఈ ప్రయత్నాలేమీ ఫలించబోవని పార్టీ వర్గాల టాక్. ఆమంచి పర్చూరుకు వెళ్లక తప్పదని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో కృష్ణమోహన్ పొలిటికల్ ఫ్యూచర్‌పై చీరాలతోపాటు జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది. మరి.. పుష్కరకాలంగా చీరాలతో చక్రం తిప్పుతున్న ఈ మాజీ ఎమ్మెల్యే పార్టీ పెద్ద ఆఫర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)