ఖమ్మం డీసీసీబీలో నిధుల గోల్‌మాల్‌పై కేసు...

ఖమ్మం డీసీసీబీలో నిధుల గోల్‌మాల్‌పై కేసు...

ఒక బ్యాంకు.. పది కోట్ల నిధులు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. DCCB మాజీ ఛైర్మన్‌ సహా ముగ్గురు సీఈవోలు, 21 మంది డైరెక్టర్లపై కేసు పెట్టడంతో అలజడి రేగుతోంది. దీని వెనక ఎవరున్నారు? ఎందుకు కేసు పెట్టారు అని ఆరా తీస్తున్నాయి అధికార పార్టీ వర్గాలు. 

రాజకీయ విభేదాల వల్లే కేసు పెట్టారా?

ఉమ్మడి ఖమ్మం జిల్లా DCCB మాజీ ఛైర్మన్‌ మువ్వా విజయబాబు, ఆయన పాలకవర్గంలోని 21 మంది డైరెక్టర్లపై కేసు నమోదు సంచలనంగా మారింది. ఈ కేసు నమోదు వెనక ఎవరు ఉన్నారు? రాజకీయ విభేదాలే కారణమా? ఓ నేత అనుచరులపైనా  కేసు పెట్టడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపారు? అని జిల్లాలోని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం గత పాలకవర్గంతో వదిలిపెట్టకుండా ముగ్గురు పాత సీఈవోలపైనా FIR కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

అప్పట్లోనే ఆస్పత్రి ఏర్పాటుపై ఆరోపణలు!

విజయబాబు బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రైతుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇది జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా ఉండే ఆస్పత్రి. దేశంలో ఎక్కడా సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో ఆస్పత్రులు లేవు. దాంతో బ్యాంకు నిధులను మళ్లించడానికే ఆస్పత్రిని తెరపైకి తీసుకొచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అదే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారినట్టు చెబుతున్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత విజయ్‌బాబు ట్రస్ట్‌లోని ప్రైవేట్‌ వ్యక్తులకు ఆస్పత్రిని అప్పగించడం కూడా మరో వివాదానికి కేంద్రబిందువైంది. 

కేసు వెనక ఓ కీలక నేత ఉన్నట్టు మువ్వా అనుమానం!

ఆస్పత్రి నిర్మాణానికి రైతు సంక్షేమ నిధి పేరుతో 6 కోట్ల 13 లక్షలు, ఉద్యోగులకు బహుమతులు, డైరెక్టర్లకు వెండి ప్రతిమలకు మరో 63 లక్షలు కేటాయించారట. విజ్ఞాన పర్యటన కోసం మరో 55 లక్షలు ఖర్చు చేశారట. వీటన్నింటిలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో కేసు పెట్టి తదుపరి చర్యలపై ఫోకస్‌ పెట్టారు. అప్పట్లో ఒక కీలక నేతకు విజయ్‌బాబు ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆస్పత్రి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటైంది. తర్వాతి కాలంలో మళ్లీ  డీసీసీబీ ఛైర్మన్‌ అయ్యేందుకు ప్రయత్నించినా.. ఇంకో కీలక నేత అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో లాభం లేదని అనుకున్నారో ఏమో.. మూడో వర్గం శిబిరంలో చేరిపోయారట విజయ్‌బాబు. అప్పటి నుంచి అతని కదలికలపై ఫోకస్‌ పెట్టిందట అధికార పార్టీలోని ఇంకో వర్గం. ఇప్పుడు కేసు పెట్టడం వెనక అతనే ఉన్నట్టు మువ్వా వర్గం అనుమానిస్తోందట. 

అసలు ఆట ఇప్పుడే మొదలైందా? 

మొత్తానికి జిల్లా టీఆర్‌ఎస్‌లో ఉన్న వర్గపోరు అటు తిరిగి ఇటు తిరిగి DCCB బ్యాంకుపై కేసు రూపంలో బయటపడింది. కాకపోతే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఎవరూ విమర్శించకుండా తన అనుచరుడైన బ్యాంక్‌ వైస్‌ఛైర్మన్‌పై కూడా సదరు నేత కేసులో పెట్టారని చర్చ జరుగుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెబుతున్నారట. మరి రానున్న రోజుల్లో పది కోట్ల బ్యాంకు కథ ఇంకెలాంటి రాజకీయ కక్షలకు వేదిక అవుతుందో చూడాలి.