మోడీ హనుమాన్ ఘురి సందర్శన వెనుక : తెలకపల్లి రవి

మోడీ హనుమాన్ ఘురి సందర్శన వెనుక :  తెలకపల్లి రవి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రాథమికంగా ఆరెస్సెస్‌ ప్రచారకుడిగా బయలుదేరిన నాయకుడు. అందుకే ఆయన ఏదీ ఊరికే చేయరు. తన మాటలు చేతలే గాక వేషధారణ, కదలికకు అన్నీ ప్రత్యక్ష పరోక్ష సంకేతాలు ఇస్తుంటాయి. వివిధ సమయాల్లో వివిధ తరగతులకు విభిన్న సంకేతాలు కూడా ఇవ్వడం ఈ ప్రచారకర్త ప్రధాన కమ్యూనికేషన్‌ కళలో భాగం. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనకు వెళ్లిన ప్రధాని ముందు హనుమాన్‌ ఘరికి వెళ్లారు. రాముడికి సంబంధించిన ఏ పని అయినా ముందు హనుమంతుడితో మొదలుపెట్టాలని వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. వాస్తవంలో స్థానికంగా హనుమాన్‌ఘరికి  అంతకు మించిన ప్రాధాన్యత వుంది. రాముడి పనులన్నీ హనుమంతుడు చేయడం రామాయణంలో జరిగితే అయోధ్యలో మాత్రం హనుమాన్‌గుడిలో మొదలైన వివాదం రాముడిపై పడింది. 

బాబ్రీ మసీదు/రామజన్మభూమి వివాదం 1858లో మొదలైతే హనుమాన్‌ ఘరీలో అంతకు మూడేళ్ల ముందే సమస్య తలెత్తింది. చరిత్ర కారుడు కెఎన్‌ ఫణిక్కర్‌ దీన్ని రికార్డు చేశారు. 1855లో షా గులాం హుస్సేన్‌ నాయకత్వంలో కొందరు సున్నీ ముస్లింలు హనుమాన్‌ ఘరీ దగ్గర ఆందోళన మొదలు పెట్టారు. అక్కడ ఒక మసీదు ఉండేదని దాన్ని పడగొట్టి హనుమంతుడి గుడి కట్టారని వివాదం పెట్టుకున్నారు. స్థానిక హిందూ భూస్వాములు వారిని తరిమికొడితే వెళ్లి బాబ్రీ మసీదు ఆవరణలో దాచుకున్నారు. వారిని అక్కడినుంచి కూడా వెళ్లగొట్టి తిరిగి వచ్చారు స్థానిక హిందువు. అవధ్‌ నవాబు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేశారు. 

ఆ క్రమంలో బాబ్రీ ప్రాంగణంలో రాముడి విగ్రహం ప్రతిష్టాపన, గోడపై శ్రీరామ రాయడం జరిగింది. కోర్టులోనూ వివాదం మొదలైంది. మొదటిసారిగా 1860లో ఇలియట్‌ అనే బ్రిటిష్‌ అధికారి మొదటిసారిగా బాబరు రామాలయాన్ని కూల్చినట్టు రాశారు. 1870లో కార్నెగీ అనే మరో ఉద్యోగి దాన్ని ఇంకా విస్త్రతం చేశాడు. మిగిలిన చరిత్ర అంతా తెలిసిందే.  మొత్తం మీద హనుమాన్‌ ఘరీ తోనే అయోధ్యలో వివాదం మొదలైందని స్థానికులకు బాగా తెలుసు. ఆ సంగతి ప్రధాని మోడీకీ తెలుసు. అందుకే ఆయన ముందు అక్కడకు వెళ్లి ప్రార్థనలు చేసిన తర్వాతనే శంకుస్థాపనకు వచ్చారన్న మాట. దాని ద్వారా ఉత్తర ప్రదేశ్‌ ప్రజలకు రాజకీయ సంకేతాలు అందించారు. సంఘపరివార్ ‌శ్రేణులను సంతృప్తిపర్చారు.