దినేష్ కార్తీక్ తప్పుకున్నాడా ? తప్పించారా ?

దినేష్ కార్తీక్ తప్పుకున్నాడా ? తప్పించారా ?

కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే, దినేష్‌ కార్తీకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా..? జట్టు యాజమాన్యమే కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిందా..? కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి అతడి వైఫల్యాలే కారణమా..? అనే విషయాల్లోకి వెళ్తే ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లకు దినేశ్‌ కార్తీక్‌ కోల్‌కతాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే టీమ్‌ను ముందుండి నడిపించడంలో కార్తీక్‌ వైఫల్యం చెందాడు. అంతేగాక బ్యాటింగ్‌లో తడబడతున్నాడు.  కోల్‌కతా కెప్టెన్సీ నుంచి కార్తీక్‌ను తప్పించాలని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వరుసగా కామెంట్లు పెట్టారు.

దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దినేష్‌ కార్తీక్‌. 2018లో కెప్టెన్‌ గా బాధ్యతలు అందుకున్న కార్తీక్‌ సారథ్యంపై ఈ సీజన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. విఫలమవుతున్న సునీల్‌ నరైన్‌ ను ఓపెనర్‌గా కొనసాగించడం, బ్యాటింగ్‌ స్థానంలో కార్తీక్‌ ముందుకు రావడం, నాణ్యమైన స్పిన్నర్‌ కుల్‌ దీప్‌ యాదవ్‌ కు ఛాన్స్‌లు ఇవ్వకపోవడంతో అతడి కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్‌ కు చేరక పోవడంతో ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ రసెల్‌ కార్తీక్‌ కెప్టెన్సీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అయితే కార్తీక్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. జట్టు కోసం కార్తీక్‌ స్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని కొందరంటుంటే మరి కొందరు యాజమాన్యం ఒత్తిడితో కఠిన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇక మోర్గాన్ కూడా కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హుడే. 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి పేరుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నైట్‌రైడర్స్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.