అచ్చెన్నాయుడు మౌనానికి కారణం అదేనా...?

అచ్చెన్నాయుడు మౌనానికి కారణం అదేనా...?

ESI స్కామ్‌లో అరెస్టయి 2 నెలల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మౌనంగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడయ్యేంత వరకు మాట్లాడకుండా ఆగుదాం అనుకున్నారా? లేక కేసులకు భయపడి గమ్మున ఉన్నారా? చంద్రబాబు పరామర్శ తరువాత చేసిన ట్వీట్‌కు కట్టుబడి ఉంటారా? పదవి వచ్చాకనే గళం విప్పుతారా?

అచ్చెన్న ఏం చెబుతారు అన్న చర్చ జరిగింది!

2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో ఇద్దరు మంత్రులు అరెస్టయి జైలుకు వెళ్లారు. వీరిలో అచ్చెన్నను ESI స్కామ్‌లో ACB అరెస్ట్‌ చేసింది. అనారోగ్యంతో కొద్దిరోజులు జైలులో.. మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారాయన. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే కేసుల్లో ఇరికించారని టీడీపీ ఆరోపించింది.  అచ్చెన్న మాత్రం అరెస్టు, కేసులపై ఏం చెబుతారు?  అని అంతా ఎదురు చూశారు. కానీ.. నేతలు, కార్యకర్తల అంచనాలకు భిన్నంగా అచ్చెన్న సైలెంట్ అయిపోయారు. 

ఇన్ని రోజులుగా అచ్చెన్న ఎలాంటి వివరణ ఇవ్వలేదు!

అచ్చెన్నాయుడు విడుదలై నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజుల్లో ఎక్కడా కూడా  తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అరెస్టు, తదనంతర పరిణామాలతో కలత చెంది మాజీ మంత్రి సైలెంట్ అయ్యారనే ప్రచారం జరిగింది. గతం కంటే తీవ్రంగా ప్రభుత్వంపై విరుచుకుపడతారని ఆశించిన పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఇదే సమయంలో అచ్చెన్నకు రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. అధికారిక ప్రకటన విడుదల కాకపోవడానికి అచ్చెన్న అరెస్టుకు కమిటీ ప్రకటన మధ్య లింక్ ఉందని కొందరు చెపుతున్నారు. 

అచ్చెన్న మౌనం వ్యూహమేనా? 

ఎలాగూ అధ్యక్ష పదవి వస్తుంది కాబట్టి అప్పటి వరకు మాజీ మంత్రి సైలెంట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. 40 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనంత మాత్రన భయపడినట్లో.. వెనకడుగ వేసినట్లో కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మౌనం అంతా వ్యూహమేనట. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలు విదిలిస్తారని అంటున్నారు. చంద్రబాబు పరామర్శ సందర్భంగా అచెన్న చేసిన ట్వీట్‌ను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అక్రమ కేసులకు బయపడేది లేదని.. ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని నాడు అచ్చెన్న ట్వీట్ చేశారని.. దానికే కట్టుబడి ఉన్నారని కొందరు నేతలు చెబుతున్నారు. అధ్యక్ష బాధ్యతల్లో ఎలా వ్యవహరించాలనే దానికోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీ టీడీపీ అధ్యక్షుడయ్యాక అచ్చెన్న రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

అందుకే ఏపీ టీడీపీ కమిటీ ప్రకటన తరువాత అచ్చెన్న పోరాటం ఎలా ఉండబోతుంది? అధినేతతో సహా క్యాడర్ అంచనాలను అందుకునేలా పోరాటం చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా  ఓ హత్య కేసులో అరెస్టయి జైలులో ఉండి వచ్చారు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న కొల్లు తర్వాత బయటకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు.  అయితేకొల్లుపై క్యాడర్ కు ఇటువంటి అంచనాలు లేవని.. అచ్చెన్నపై హోప్ ఉంది కాబట్టే చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.