బెజవాడలో ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్లపై రచ్చ..! మళ్లీ పైరవీలు..?

బెజవాడలో ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్లపై రచ్చ..! మళ్లీ పైరవీలు..?

ప్రైవేట్ కోవిడ్‌ సెంటర్లపై సర్కార్‌ కొరఢా ఝుళిపించింది. బెజవాడ స్వర్ణ ప్యాలెస్‌ ఘటన తర్వాత నిబంధనలు పాటించని వాటి అనుమతులు రద్దు చేసింది. స్వర్ణా ప్యాలెస్‌ అగ్నిప్రమాదం తర్వాత విజయవాడలోని 9 కోవిడ్‌ సెంటర్ల అనుమతులను ప్రభుత్వం రద్దు చేస్తే.. రిటైర్మెంట్‌ రోజున డీఎంహెచ్‌వో రమేష్‌ మరో 13 సెంటర్లకు ఇచ్చిన పర్మిషన్స్‌ను క్యాన్సిల్‌ చేశారు. ఈ చర్య దుమారం రేపింది. అర్ధాంతరంగా అనుమతులు రద్దు అంటే.. వాటికి పర్మిషన్‌ ఇచ్చే సమయంలో లక్షల రూపాయలు చేతులు మారాయని అంతా అనుమనించారు. ఇదే కోణంలో ప్రభుత్వం ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం చేసినట్లు చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనుమతులు రద్దయిన ప్రైవేట్ కోవిడ్‌ సెంటర్లు స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపుతోంది. 

ప్రజాప్రతినిధుల అండతోనే ఈ సెంటర్లన్నీ మరోసారి దరఖాస్తు చేసుకున్నాయని టాక్‌ వినిపిస్తోంది. బెజవాడలోని వినాయక్‌ థియేటర్‌ దగ్గర ఉన్న ఓ ఆస్పత్రికి మళ్లీ అనుమతి ఇచ్చేందుకు ఏకంగా సీఎంవో నుంచే ఓ అధికారి సిఫారసు చేస్తున్నారట. పిన్నమనేని పాలీక్లీనిక్‌ పక్కన ఉన్న కోవిడ్‌ సెంటర్‌ కోసమైతే ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు మంత్రాంగం నడుపుతున్నారట. అలాగే కొత్త ప్రభుత్వాస్పత్రి దగ్గర అనుమతి రద్దయిన ఓ ఆస్పత్రి యాజమాన్యం తరఫున కృష్ణాజిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా అధికారులకే ఫోన్లు చేస్తున్నారట. సూర్యారావుపేటలో ఉన్న రెండు కోవిడ్‌ సెంటర్ల అనుమతి రద్దు చేయడంతో వారి కోసం బెజవాడ ఎమ్మెల్యే పట్టుబడుతున్నారట. నిబంధనలు పాటించని వారికి అనుమతులు ఇచ్చి రిటైర్మెంట్‌ రోజున వాటి అనుమతులు రద్దు చేసిన పాత డీఎంహెచ్‌వో అడ్డంగా బుక్కయ్యారని.. అధికార వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటే.. అన్నీ సక్రమంగా ఉంటే వాటికి అనుమతి ఇస్తామని కొత్త డీఎంహెచ్‌వో చెబుతున్నారట. ఈ ప్రకటనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. ఒకసారి పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేసిన తర్వాత కనీసం సమయం కూడా ఇవ్వకుండా వెంటనే అన్నీ సరిచేసేస్తారా? వీటి వెనక కూడా మళ్లీ డబ్బులు చేతులు మారాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అలాగే రాజకీయ నేతల సిఫారసులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట మరికొందరు. మరి.. రాజకీయ పలుకుడే నెగ్గుతుందో.. నిబంధనల ప్రకారమే అధికారులు వెళ్తారో చూడాలి.