కొత్త రూల్స్ వ‌స్తున్నాయి..! ఏటీఎం నుంచి విత్‌డ్రా ఆ మొత్తం దాటితే బాదుడే..!

కొత్త రూల్స్ వ‌స్తున్నాయి..! ఏటీఎం నుంచి విత్‌డ్రా ఆ మొత్తం దాటితే బాదుడే..!


లాక్‌డౌన్ స‌మ‌యంలో ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా.. ఎంత మొత్త‌మైన విత్‌డ్రా చేసుకోండి అనే త‌ర‌హాలో అవ‌కాశం క‌ల్పించింది రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా... బ్యాంకుల ఏటీఎంల‌తో సంబంధం లేకుండా.. ఏ ఏటీఎం నుంచైనా.. ప‌రిమితికి లోబ‌డి.. ఎన్నిసార్లు అయినా విత్‌‌డ్రాకు అవ‌కాశం క‌ల్పించింది.. కానీ, ఇప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌కు షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.. ఏటీఎం చార్జీలు పెంచే ఆలోచ‌న ఆర్బీఐ చేస్తుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.. ఆర్బీఐ నియమించిన కమిటీ దేశవ్యాప్తంగా ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఛార్జీలు పెంచాలని సిఫారసు చేసినట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి. ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.5,000 వరకు మాత్రమే తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకొచ్చే ఆలోచ‌న‌లు చేస్తున్నారు.. అంటే.. రూ.5 వేలు దాటి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే చార్జీలు వ‌డ్డించ‌నున్నారు. ఏటీఎం నుంచి అధిక క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ కమిటీ ఈ సిఫార్సు చేసినట్లు  స‌మాచారం.. రూ.5 వేలకు పైగా క్యాష్ విత్‌డ్రాకు సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్‌కు చార్జీలు వ‌సూలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. 

ఇంటర్‌చేంజ్ చార్జీలను 10 లక్షలు లేదా ఆపైన జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో 16 శాతం.. రూ.2 నుంచి రూ.17 వ‌ర‌కు పెంచాలని ఆర్‌బీఐ కమిటీ సూచించింది. ఫైనాన్షియల్ లావాదేవీల‌కు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీల‌కు చార్జీలను రూ.7గా నిర్దేశించాలని తెలిపింది. ఇక‌, 10 లక్షలకులోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఈ చార్జీలను రూ.3 పెంచాలని నివేదిక‌లో పేర్కొన్నార‌ని తెలుస్తోంది... ఇదే స‌మ‌యంలో.. 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఉచిత లావాదేవీల‌ను కూడా ఐదుకు పెంచాలని కమిటీ సూచించింది. మ‌రోవైపు అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఈ లావాదేవీలను  మూడుగా నిర్ణయించాలని తెలిపింది. ఏటీఎం ఉచిత లావాదేవీలు అయిపోయిన తర్వాత గరిష్ట చార్జీలను రూ.24కు పెంచాలని సూచించింది. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు నిర్మాణాన్ని సమీక్షించడానికి గత సంవత్సరం నియమించిన ఈ కమిటీ తన సిఫార్సుల‌ను ఆర్బీఐకి స‌మ‌ర్పించింది.. అయితే.. వాటిని ఆర్బీఐ అంగీక‌రిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఏటీఎంల వినియోగం సుల‌భం కావ‌డంతో.. బ్రాంచ్‌తో పోలిస్తే ప్రతి వినియోగదారు ఏటీఎంల ద‌గ్గ‌ర విత్‌డ్రా చేసుకోవ‌డం పెరిగిపోయింది.. దాంతో.. ఒకే ఏటీఎం లావాదేవీల ఖర్చును ఒకే బ్రాంచ్ లావాదేవీలతో పోల్చడం సముచితం కాదు అని నివేదిక పేర్కొంది.