ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు కూడా జడేజా దూరం...

ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు కూడా జడేజా దూరం...

ఆసీస్ సిరీస్ లో భారత ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ జడ్డూ ఆడడం అనుమానంగానే మారిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడ్డేజా.. చివరి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ విసిరిన బంతి అతడి బొటనవేలు తాకడంతో వేలు విరిగింది. దాంతో జడ్డూకు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఇక ఆసీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన జడేజాను రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ పంపనుంది. అయితే గతంలో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం జడ్డూకు విశ్రాంతి అవసరం అయిన నేపథ్యంలోనే అతడు టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి అతను కనీసం పరిమిత ఓవర్ల సిరీస్ సమయానికైనా తిరిగి వస్తాడా.. లేదా అనేది చూడాలి.