అయోమయంలో రాపాక వరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు

అయోమయంలో రాపాక వరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు

గెలిచిన పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఆయన అధికార పార్టీతో చేయి కలిపారు. అంతా సూపర్‌గా ఉంటుందని ఆశించిన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఆయనకు పోటీగా మరో రెండు వర్గాలు యాక్టివ్‌గా ఉండటంతో గుబులు మొదలైందని సమాచారం. దీంతో ఎమ్మెల్యే భవిష్యత్‌ ఏంటా అని అంతా చర్చించుకుంటున్నారు. 

రాజోలులో రాపాకకు గడ్డు పరిస్థితులు? 

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది. అనధికారికంగా వైసీపీకి అనుబంధ సభ్యుడిగా ఉన్న ఆయనకు కొంతకాలంగా నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట.

ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నారా? 

మొన్నటి వరకు రాజోలులో వైసీపీ రెండు వర్గాలుగా ఉండేది.  ఒక గ్రూపు ఎమ్మెల్యే రాపాకకు మద్దతుగా నిలిచేది. వరసగా రెండు ఎన్నికల్లో ఓడిన బొంతు రాజేశ్వరరావు ఓ వర్గమైతే..  రాజోలు ఇంఛార్జ్‌గా ఉన్న పెదపాటి అమ్మాజీది మరో గ్రూపు. సీఎం జగన్‌కు జైకొట్టిన నాటి నుంచి పెదపాటి వర్గంలో కలిసి ప్రయాణిస్తున్నారు ఎమ్మెల్యే. ఏమైందో ఏమో కానీ.. ఇటీవల కాలంలో పెదపాటి అమ్మాజీ వర్గం సైతం ఎమ్మెల్యేతో టచ్‌మీ నాట్‌ అన్నట్టు ఉంటోందట. దీంతో ఇటు జనసేన.. అటు వైసీపీ కేడర్‌ రెండూ వెంట లేక.. రాజోలులో రాపాక ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

అమ్మాజీ వర్గం రివర్స్‌ గేర్‌తో రాపాక ఉక్కిరిబిక్కిరి!

ఎక్కడో తునికి చెందిన పెదపాటి అమ్మాజీని రాజోలు వైసీపీ ఇంఛార్జ్‌గా తీసుకురావడం ఎమ్మెల్యే రాపాక, ఆయనకు సన్నిహితంగా ఉంటే కొందరు వైసీపీ జిల్లా పెద్దల వ్యూహంగా చెబుతారు. మాజీ ఇంఛార్జ్‌ బొంతు రాజేశ్వరరావును జీరో చేసి.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ టికెట్‌ రాపాకకే దక్కేలా  ప్లాన్‌ అమలు చేస్తున్నారట. కానీ.. అదే అమ్మాజీ వర్గం ఇప్పుడు రివర్స్ అయిందట. అలాగే బొంతుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. 

రాపాక వెంట తగిన బలం, బలగం లేదా? 

ఈ పరిణామాలతో లాభం లేదని భావించిన ఎమ్మెల్యే రాపాక.. ఆ మధ్య తాను వైసీపీ వాడినే అని ప్రకటించి.. ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా రాజోలు వైసీపీలో వర్గాలు రెండు నుంచి మూడయ్యాయి. సమయం చిక్కినప్పుడల్లా సీఎం జగన్‌పై పొగడ్తలు.. జనసేనానిపై తెగడ్తలకు దిగుతూ సొంత వర్గాన్ని బలపరుచుకునే పనిలో పడ్డారు. అయినా సరే.. గతంలో ఉన్నంత సందడి.. బలగం వెంట కనిపించడం లేదనే టాక్‌ రాజోలులో ఉంది. 

రాజోలులో రాపాకకు పెద్ద సవాళ్లేనా? 

ఇటీవల అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ పనుల్లో ఎమ్మెల్యే హోదాలో రాపాక వరప్రసాద్‌ పాల్గొన్నారు. అయితే గతంతో పోల్చితే ఎమ్మెల్యేకు మద్దతుదార్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందనే కామెంట్స్‌.. ఆనాటి కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి వినిపించాయట. అటు అమ్మాజీ ఇటు బొంతు వర్గాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిని కాదని లేదా వీరిని మించి స్థానికంగా బలపడటం రాపాకకు పెద్ద సవాలే అన్నది పార్టీ వర్గాల వాదన. అందుకే రాపాక రాజకీయ భవిష్యత్‌ అంతా పార్టీ అధినేత చేతుల్లోనే ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.