ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో అనే భయం ఉంది : రఘురామ

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో అనే భయం ఉంది : రఘురామ

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. హిందూ దేవలయాల్లోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాలు చోరికి గురవటం దురదృష్టకరమని అన్నారు. మంత్రి ఇంటికి పక్కనే ఉన్న దేవాలయాల్లో ఇలా దొంగతనాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. సాయి బాబా గుడి లో విగ్రహం విరగగొట్టడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు. దేవలయాలపై దృష్టిపెట్టే మంత్రిని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. రాయలసీమలో కూర్చొని “ఖబార్డర్ రఘు రామకృష్ణ రాజు” అంటే ఎవరు భయపడరని వ్యాఖ్యానించారు.తనతో సన్నిహితంగా మెలుగుతున్న ఎంపీలను సున్నితంగా బెదిరించారని చెప్పారు. నిన్న జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను పిలవలేదని ఈ అంశాన్నీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఫోన్ లో మాట్లాడాలంటే కూడా ట్యాపింగ్ చేస్తున్నారేమో అనే భయం ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ, పుంగనూరు లోని  శివశక్తి పాలకేంద్రం సరైన ధర చెల్లించకుండా రైతుల నుంచి పాల సేకరణ చేస్తుందని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.  శివశక్తి సంస్థ దోపిడీ పై ఆధారాలు ఇవ్వడానికి తాను సిద్ధమని తెలిపారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల, ప్రభుత్వంలో కీలక వ్యక్తుల చేతుల్లో శివశక్తి సంస్థ ఉందని అన్నారు. రాయలసీమ వారు తన దిష్టిబొమ్మలు తగలబెట్టడం తప్ప ఏమి చేయలేరని వ్యాఖ్యానించారు. అమరావతి భూములపై వేసిన “సిట్” విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ప్రకటన తర్వాత, ఆ ప్రాంతంలో భూములు కొన్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నాక అక్కడ భూములు కొనుక్కున్న వారి పరిస్థితి ఇప్పుడు ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసింది “ఇన్ సైడర్ ట్రేడింగ్” అయితే,  మీరు చేస్తున్నది “అవుట్ సైడ్ ట్రేడింగ్” అనాలా? అంటూ మండిపడ్డారు.  ప్రజలను నమ్మించి మోసం చేసిన నాయకులపై బాధితులు “సిట్” వేయమని అడగవచ్చా అని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. సీఎం చుట్టూ ఉన్న వ్యక్తులు చేస్తున్న చెడ్డపనులతో  సీఎం కి చెడ్డపేరు వస్తుందని అన్నారు. నేను కాపాడలనుకునే మీరు కూడా నన్ను అణచివేయాలని చూడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ పై దాడి మంచిది కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం తనను అనర్హుడిగా ప్రకటించడం సాధ్యం కాదని అన్నారు.  తనను  అనర్హుడిగా ప్రకటించడం కోసం, రాష్ట్ర సమస్యలను తాకట్టు పెట్టొద్దని అన్నారు.