మోడీ మాటిచ్చిన చోటే రాహుల్ సభ

మోడీ మాటిచ్చిన చోటే రాహుల్ సభ

ప్రత్యేక హోదాపై సరిగ్గా ఐదేళ్ల క్రితం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇవాళ అనంతపురంలో ఆయన మాట్లాడుతూ మోడీ హామీ ఇచ్చిన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్ లోనే రాహుల్ సభ నిర్వహించి హామీ ఇస్తామని ప్రకటన చేస్తారని చెప్పారు. మోడీ ద్రోహం చేసిన స్థలంలోనే రాహుల్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తారన్నారు. తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదయం కలిగి తమ వద్దకు వచ్చిందని..ఇందులో తప్పేముందన్న రఘువీరా.. రాజ్యంగ సంస్థల విచ్ఛిన్నం, మోడీ చేస్తున్న మోసాన్ని టీడీపీ ఆలస్యంగా గ్రహించిందన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉందని... ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు తమ రెండు పార్టీల మధ్య పొత్తుల ప్రస్తావనే రాలేదన్నారు. రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తున్నా ప్రతిపక్షం కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా లేదన్నారు. హోదా మీద సంతకం చేసిన వారికే తమ మద్దతు అంటూ వైసీపీ మోసం చేస్తోందని విమర్శించారు.