పదవి కాదు..బాధ్యత : బీజేపీ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

పదవి కాదు..బాధ్యత : బీజేపీ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనను ఎంపిక చేసిన అధిష్టానానికి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీ తో ఆమె మాట్లాడుతూ.. ఉన్నత పదవీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి అనేది పదవీ కాదు...బాధ్యత అని...పట్టుదలతో  బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోతామని ఆమె పేర్కొన్నారు.   దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, అయినా.. ఆయా రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.  జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని...ఇక ముందు కలిసి ముందుకు వెళతామని పురందేశ్వరి పేర్కొన్నారు. అలాగే టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటిస్తామని తెలిపారు. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని...న్యాయస్థానం సరైన తీర్పు ఇస్తుందన్నారు. ఏపీ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో బీజేపీ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు.