ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రొటోకాల్‌ రగడ!

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రొటోకాల్‌ రగడ!

చెప్పడం ఎందుకు అనుకున్నారో ఏమో.. అధికారిక కార్యక్రమాలకు విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను పిలవడం లేదట. దీంతో అక్కడ ప్రొటోకాల్‌ రగడ రాజుకుంది. అధికారులకు మద్దెలదరువు మొదలైంది. పిలిస్తే మంత్రితో తగువు.. పిలవకపోతే వీరితో పేచీ అన్నట్లుగా మారిపోయిందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 
 
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రొటోకాల్‌ రగడ!

అధికార పక్షం, విపక్షం ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండటం సహజం. గతంలో ఎన్నికల వరకే ఈ పోరు కనిపించేది. ఇప్పుడు రోజూ ఇదే తగువు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌, ఇతర విపక్ష పార్టీల కార్పొరేటర్ల మధ్య గొడవ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌, లెఫ్ట్ తదితర పార్టీల కార్పొరేటర్లకు ప్రాధాన్యం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకే ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారట. ఇది కాస్తా ప్రొటోకాల్‌ రగడకు దారితీస్తోందని.. మధ్యలో అధికారులు నలిగిపోతున్నారని చెప్పుకొంటున్నారు. 
 
ప్రారంభోత్సవాలకు విపక్ష కార్పొరేటర్లకు ఆహ్వానాలు లేవు!

కాంగ్రెస్‌, సీపీఎం కార్పొరేటర్లు ఉన్న ప్రాంతాల్లో చేపట్టే అధికారిక కార్యక్రమాల గురించి వారికి చెప్పడం లేదట. మంత్రులు వస్తున్నా.. ప్రారంభోత్సవాలు జరుగుతున్నా ఆహ్వానాలు లేవట. పై నుంచి ఒత్తిళ్లో ఏమో కానీ.. అధికారులు కూడా విపక్ష కార్పొరేటర్లను పిలవాలన్న ఆలోచన చేయడం లేదని సమాచారం. వార్డుల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలనేదానిపై మంత్రులు నిర్వహించే అధికారిక సమీక్షలకు పిలవడం లేదని చెబుతున్నారు. 
 
విపక్షాలు ప్రశ్నించినా సమాధానం లేదా?

ఆ మధ్య ఖమ్మం  గాంధీచౌక్‌లో స్థానిక కార్పొరేటర్‌ యర్రం బాలగంగాధర్‌ తిలక్‌కు సమాచారం ఇవ్వకుండా అధికారికంగా గాంధీ విగ్రహావిష్కరణ చేశారట. మంత్రి పువ్వాడ అజయ్‌ వచ్చి విగ్రహావిష్కరణ చేశారు. అక్కడే కరోనా రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ల శిబిరం ప్రారంభించినా చెప్పలేదని అంటున్నారు.  దీనిపై అధికారులను ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో.. కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో కార్పొరేటర్‌ నిరసన తెలిపారు. 
 
మంత్రి నిర్వహించిన సమీక్షకు పిలుపు లేదు!

మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ గురించి వివరించేందుకు ఖమ్మం హ్యూమన్‌ రిసోర్స్‌ కార్యాలయంలో అధికారికంగా ఓ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఇతర అధికారులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను ఆహ్వానించిన అధికారులు.. విపక్ష పార్టీల కార్పొరేటర్లను పిలవలేదు. పైగా ఇందులో ప్రొటోకాల్‌ ఏముంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. అలాంటిది ఏదైనా ఉంటే వారే చెబుతారు కదా అని అధికారులపైకి నెపం నెట్టేస్తున్నారట. 
 
ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు?

ఒకవేళ విపక్ష పార్టీల నుంచి ప్రొటోకాల్‌పై ఫిర్యాదులు వస్తే..  ఉన్నతాధికారులు కనీసం వాటివైపు కూడా చూడటం లేదట. దీంతో నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయడం తప్ప విపక్ష పార్టీలకు మరో మార్గం కనిపించడం లేదని అనుకుంటున్నారట. మరి.. ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.