ప్రయోగాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి

ప్రయోగాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి

ప్రముఖ నిర్మాత ఎమ్.శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరు వినగానే ముందుగా ఆయన నిర్మించిన గ్రాఫిక్ మూవీస్ గుర్తుకు వస్తాయి. తెలుగునాట గ్రాఫిక్ మూవీస్ కు క్రేజ్ సంపాదించి పెట్టి, వాటితోనే వరుసగా సాగారు శ్యామ్. అందుకే ఆయన సినిమాలంటే జనానికి కూడా ఎంతో ఆసక్తి ఉండేది. 'అరుంధతి' (2009) వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించినా, ఎందుకనో ఆయన ఆ తరువాత సినిమాలకు దూరంగా జరిగారు. మల్లెమాల ఫిలిమ్స్  బ్యానర్ పై "ఢీ, జబర్దస్త్, జీన్స్, అదుర్స్, క్యాష్, స్టార్ మహిళ" వంటి కార్యక్రమాలు నిర్మిస్తూ వాటిని ఈటీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లో ప్రదర్శిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారు. దాంతో సినిమాలు నిర్మించే తీరిక లేకుండా ఆయన బుల్లితెరపై కూడా ప్రయోగాలు చేస్తూ ఆనందంగా ముందుకు పోతున్నారు. 

తండ్రి కన్నా మిన్న...
శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి (మల్లెమాల సుందరరామిరెడ్డి). నిర్మాతగా ఎమ్మెస్ రెడ్డి భారీ విజయాలేవీ నమోదు చేసుకోలేదు. యన్టీఆర్ తో ఎమ్మెస్ రెడ్డి నిర్మించిన 'శ్రీకృష్ణ విజయం', శోభన్ బాబు తో తెరకెక్కించిన "కోడెనాగు, రామబాణం", జయసుధతో తీసిన 'ముత్యాలపల్లకి' ఏవీ విజయాలను సాధించలేకపోయాయి. కృష్ణ హీరోగా ఆయన నిర్మించిన 'పల్నాటి సింహం' మంచి విజయం అందుకుంది. తరువాత కృష్ణతో తీసిన 'ఏకలవ్య' కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఎమ్మెస్ రెడ్డి నిర్మించిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అందరూ బాలనటులతో 'రామాయణం' తీశారు. ఈ సినిమా ద్వారానే జూనియర్ యన్టీఆర్ తెరకు పరిచయమయ్యారు. బాలకృష్ణ హీరోగా 'వంశోద్ధారకుడు', మీనాతో 'వెలుగునీడలు' నిర్మించారు. అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇలా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా పెద్ద విజయాలేవీ నమోదు చేయలేకపోయారు. అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. 

గ్రాఫిక్స్  మాయాజాలం...
అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తాను ఏది చేసినా అందులో తనదైన ముద్ర ఉండాలని తపించారు. తండ్రి బాటలోనే పయనిస్తూ చిత్ర నిర్మాణాన్నే కెరీర్ గా ఎంచుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో  రాజశేఖర్, జీవితతో 'తలంబ్రాలు' (1987) నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే "ఆహుతి, అంకుశం" వంటి సినిమాలు నిర్మించగా, వాటిలో 'అంకుశం' ఘనవిజయం సాధించింది. అందులో తండ్రి ఎమ్మెస్ రెడ్డితో ఓ ప్రధాన భూమికనూ పోషింప చేశారు. ఆ చిత్ర విజయంతోనే తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికన్నా మిన్నగా సాగిన కుమారుడు అని పేరు సంపాదించారు. హాలీవుడ్ మూవీ 'టెర్మినేటర్' చూసిన తరువాత తెలుగులోనూ అలాంటి గ్రాఫిక్ మూవీని తెరకెక్కించాలని తపించారు. అయితే చందమామా విజయాకంబైన్స్ పతాకంపై 'భైరవద్వీపం' తెలుగులో గ్రాఫిక్స్ తో  సందడి చేసిన చిత్రంగా నిలచింది. అయినా శ్యామ్ తన పట్టు వీడలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే 'అమ్మోరు' చిత్రాన్ని గ్రాఫిక్ మాయాజాలంతో నిర్మించారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. దాంతో గ్రాఫిక్స్ తో మరో మాయాజాలం చేయాలని కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే చిరంజీవి హీరోగా 'అంజి'ని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఇందులో ప్రదర్శించిన గ్రాఫిక్ మాయాజాలం లాంటివి అప్పటికే బుల్లితెరపైనా కనిపించడంతో, 'అంజి' జనాన్ని ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా పరాజయంతోనూ శ్యామ్ ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. ముందడుగు వేసి 'అరుంధతి' నిర్మించారు. ఈ సినిమాతో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయారు. అలా వరుసగా గ్రాఫిక్స్ తో మాయచేసిన ఘనతను దక్కించుకున్నారు శ్యామ్ ప్రసాద్. అయితే ఆ తరువాత నుంచీ తన దృష్టిని బుల్లితెరపైకి మళ్ళించారు. అక్కడ పలు ప్రయోగాలతో సాగుతూ మంచి లాభాలు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురు వరలక్ష్మిని వివాహమాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఇద్దరు కూతుళ్ళు. వారు కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ బుల్లితెరపై తమ 'మల్లెమాల' విజయకేతనం ఎగురవేసేలా చేస్తున్నారు. 

ఏది ఏమైనా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నిబద్ధత గలిగిన నిర్మాత సినిమాలు నిర్మించకపోవడం చిత్రసీమకు తీరని లోటనే చెప్పాలి. ఆయన మళ్ళీ  చిత్రాలు నిర్మిస్తే చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. బుల్లితెరపై ఆయనను ఎలాంటి సవాళ్ళూ 'ఢీ'కొట్టడం లేదు. దాంతో అక్కడ 'జబర్దస్త్'గా సాగుతున్నారాయన. మరి ఇటు వైపు రమ్మంటే వస్తారా!?