జీ20 సదస్సుకు మోడీ.. చమురు ధరలపై ఫోకస్..!

జీ20 సదస్సుకు మోడీ.. చమురు ధరలపై ఫోకస్..!

అర్జెంటీనాలో జరిగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు భారత ప్రధాని నరేంద్ర మోడీ... ప్రధానంగా ఈ పర్యటనలో చమురు ధరలపై దృష్టిసారించనున్నారు. అంతర్జాతయ పరిస్థితులతో కొంత కాలం బయపెట్టిన చమురు ధరలు... ఇప్పుడు కొంతమేర తగ్గిన విషయం తెలిసిందే. ఇక 2008 ఆర్థిక సంక్షోభం నుండి మార్గాలను చర్చించడానికి 20 దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశం ఇప్పటి వరకు సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ బ్లూప్రింట్‌ను రూపొందించనున్నారు. ఈ సదస్సులో మొత్తం మూడు సెషన్లు నిర్వహించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి సెషన్‌లో 'పుటింగ్ పీపుల్ ఫస్ట్' అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్‌లో డిజిటల్ విప్లవం, జన్ ధన్ యోజన, ముద్ర యోజన లాంటి ప్రధాన ప్రాజెక్టులు, సంస్కరణ కార్యక్రమాలు, ఆధార్, జీఎస్టీ, నగదు బదిలీ వంటి అంశాలపై ఆయన ప్రసంగం కొనసాగనుంది. ఇక జీ20 దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తగ్గించుకోవడానికి సలహాలు ఇవ్వనున్నారు మోడీ.

జీ20 సదస్సు వేదికగా మరోసారి చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు మోడీ... ఈ ఇద్దరి భేటీ జరగడం ఇది నాల్గో సారి. ద్వైపాక్షిక పురోగతిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే బ్రిక్స్ దేశాల అధిపతులు, జీ20 దేశాల అధిపతులు కలుసుకుంటారు. అర్జెంటీనాలో అమెరికా-చైనా మధ్య ఒక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్, చైనా మధ్య పలు అంశాలపై రాజకీయ సంబంధాలపై చర్చలు ఉంటాయని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.