ప్రధాని భావోద్వేగం.. దేశం కోసం మరణించే అవకాశం రాలేదు..!

ప్రధాని భావోద్వేగం.. దేశం కోసం మరణించే అవకాశం రాలేదు..!

73వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలతో జరిగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో తాను ఇంకా పుట్టలేదని.. దాంతో తనకు దేశం కోసం మరణించే అవకాశం లభించలేదన్నారు. అయితే దేశం కోసం మరణించే అవకాశం దొరకపోయినా.. తనకు దేశం కోసం జీవించే అవకాశం లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు భారత ప్రధాని. భవిష్యత్ తరాలకు సమస్యలు లేని దేశాన్ని అందించాన్నదే తమ లక్ష్యమని.. దేశంలో అవినీతిని నిర్మూలించి పారదర్శకతతో కూడిన బాధ్యతాయుత పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఇక స్వాతంత్రత్య పోరాటంలో అమరులైన వారి త్యాగాలు దేశానికి ఎప్పటికీ ఆదర్శమేనని, వారిని తలుచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ.. స్వరాజ్య సంగ్రామం ఎంతో మందిని పొట్టనపెట్టుకుందని, వారి త్యాగాలపైనే నేటి భారతం నిర్మితమైందని గుర్తు చేశారు. వారి జీవితాలే నేటి భారతానికి ఆదర్శమని.. వారి అడుగుజాడల్లో నడుద్దామంటూ పిలుపునిచ్చారు మోడీ. మరోవైపు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్ ముందంజలో ఉందని కొనియాడారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో విదేశాల్లోనూ విశ్వాసం పొందగలిగామని అన్నారు. జనాభా పరంగా ప్రపంచంలో దేశం రెండవ స్థానంలో ఉందని, అధిగ జనాభాపై అవగాహన పెంచేలా ప్రజల్లో చర్చ జరగాలని మోదీ పిలుపునిచ్చారు. గ్లోబల్ మార్కెట్‌ను ఒడిసిపట్టుకున్నాం.. ప్రతి జిల్లా ఎగుమతి కేంద్రంగా తయారు కావాలన్న ఆయన.. ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు చేరిందన్నారు. మరోవైపు శాంతి, రక్షణ నాణేనాకి బొమ్మ, బొరుసు లాంటివన్న ప్రధాని.. తీవ్రవాదంపై భారత్‌ చేస్తోన్న పోరాటానికి ప్రపంచదేశాల మద్దతుందన్నారు.