'పల్స్ పోలియో' ప్రారంభించిన రాష్ట్రపతి

'పల్స్ పోలియో' ప్రారంభించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఆదివారం జాతీయ టీకాల దినోత్సవం పురస్కరించుకుని 2019కి గానూ తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పోలియోను దేశం నుంచి సమూలంగా తరిమివేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల మందికి పైగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలను అందించనుంది. అప్పుడే పుట్టిన వారి నుంచి ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకోవచ్చని అధికారులు సూచించారు.

చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యవంతమైన దేశంగా భారత్ ను తయారు చేసేందుకు మిషన్ ఇంద్రధనుష్ అనే కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగా దేశవ్యాప్తంగా 87 లక్షల మంది గర్భిణులకు, 3.39 కోట్ల చిన్నారులకు టీకాలు వేశామని అన్నారు.