నర్తనమే ప్రభుదేవకు కవచం...!

నర్తనమే ప్రభుదేవకు కవచం...!

స్ప్రింగ్ లా మెలికలు తిరగ గలడు. రబ్బర్ లా సాగిపోగలడు. పాదరసంలా జారిపోగలడు. అన్నీ కలిపి తనదైన నాట్యంతో అలరించ గలిగాడు ప్రభుదేవ. అతని మెలికలు తిరిగే నృత్యం చూసి జనం 'ఇండియన్ మైఖేల్ జాక్సన్' అన్నారు. నిజం చెప్పాలంటే, అతనికంటే ఘనుడు మన ప్రభుదేవ. తన అభినయంతో నవ్వించాడు, కవ్వించాడు, కొండొకచో ఏడ్పించాడు. అన్నిటా ఆకట్టుకున్నాడు. అదీ ప్రభుదేవ బాణీగా నిలచింది. ఆపై దర్శకునిగానూ అలరించాడు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు. తన ప్రతిభను ఎన్ని విధాలుగా చాటుకున్నా, ప్రభుదేవ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డాన్సులే. కాబట్టి నర్తనమే ప్రభుదేవకు కవచం అని చెప్పవచ్చు.. 

కొరియోగ్రాఫర్ గా...
ప్రముఖ నృత్యదర్శకుడు సుందరం మాస్టర్ రెండవ కొడుకు ప్రభుదేవ. అన్న రాజు సుందరం, తమ్ముడు నాగేంద్ర తో కలసి బాల్యం నుంచీ డాన్సులతోనే కాలక్షేపం చేశాడు ప్రభుదేవ. తండ్రికి ప్రభుదేవలోని మెలికలు తిరిగే బాణీ బాగా నచ్చింది. అందువల్ల రాజు కంటే ప్రభుదేవకే సుందరం ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వెళ్ళారు. తన తండ్రి డాన్స్ కంపోజ్ చేసే సినిమాలన్నిటా పనిచేసేవాడు ప్రభుదేవ. అగ్రకథానాయకుల చిత్రాలకు వారి ఇమేజ్ ను , బాడీ లాంగ్వేజ్ ను గుర్తుంచుకొని మరీ డాన్స్  కంపోజ్ చేసేవాడు ప్రభుదేవ. తరువాతి రోజుల్లో సోలోగా డాన్స్  కొరియోగ్రాఫర్ గా సాగిపోయాడు. ప్రభుదేవను చూసి ఎంతోమంది స్ఫూర్తి చెందారు. ప్రభుదేవ చేయి తగిలితే చాలు అన్నంతగా ఆయనను అభిమానించారు వర్ధమాన నృత్యకళాకారులు. వారందరికీ స్ఫూర్తిగా నిలచిన ప్రభుదేవ కొందరికి అవకాశాలూ కల్పించారు. ఆయన డాన్స్ ట్రూప్ లో పనిచేసినవారు తరువాతి రోజుల్లో డాన్స్ మాస్టర్స్ గా సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో లారెన్స్  రాఘవేంద్ర ఒకరు. 

నటునిగా...
ప్రభుదేవలోని స్పార్క్ చూసి, ఆయనను తెరపై కూడా చూపించే ప్రయత్నం చేశారు దర్వకుడు ఖదీర్. తాను రూపొందించిన 'హృదయం' చిత్రంలో "ఏప్రిల్ మేలలో పాపల్లేరురా..."  పాటను ప్రభుదేవపై చిత్రీకరించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఖదీర్ మిత్రుడు శంకర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'జెంటిల్ మేన్'లో "చుకు బుకు చుకు బుకు రైలే..." పాటలో ప్రభుదేవను నర్తింప చేసి జనాన్ని మురిపించాడు. తన రెండో చిత్రం 'కాదలన్'తో ప్రభుదేవను హీరోని చేశాడు శంకర్. ఆ సినిమాతో ప్రభుదేవ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాలలో బిజీగా నటిస్తూ సాగాడు. ప్రభుదేవ హీరోగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. అనేక తెలుగు చిత్రాలలో ప్రభుదేవ కీలక పాత్రలు పోషించి అలరించాడు. 

దర్శకునిగా...
నృత్య దర్శకత్వంలో తనదైన బాణీ పలికించే ప్రభుదేవాలో ఓ దర్శకుడు కూడా దాగున్నాడని తెలుగు నిర్మాత ఎమ్.ఎస్.రాజు పసిగట్టారు. తన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో ప్రభుదేవను దర్శకునిగా నిలిపారు రాజు. తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన 'పౌర్ణమి'లో తనకు ప్రాణమైన నృత్యాన్నే ప్రధానాంశంగా చొప్పించి సినిమా తెరకెక్కించాడు ప్రభుదేవ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘనవిజయం సాధించిన 'పోకిరి' చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా 'పోక్కిరి' పేరుతో రీమేక్ చేశాడు ప్రభుదేవ. ఆ తరువాత వరుసగా నాలుగు రీమేకులతో సాగాడు ప్రభుదేవ. వాటిలో చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్ ' ఒకటి, ఇక సరైన సక్సెస్ కోసం సల్మాన్ ఖాన్ ఎదురుచూస్తున్న సమయంలో 'పోకిరి' రీమేక్ గా ఆయనతో 'వాంటెడ్' తీశాడు ప్రభుదేవ. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగులో రాజమౌళి రూపొందించిన 'విక్రమార్కుడు' చిత్రాన్ని హిందీలో 'రౌడీ రాథోడ్'  పేరుతో రీమేక్ చేయగా, ఆ సినిమా మరింత ఘనవిజయం మూటకట్టుకుంది. అప్పటి నుంచీ వరుసగా హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సాగాడు ప్రభుదేవ. అయితే, 'వాంటెడ్, రౌడీ రాథోడ్' స్థాయి విజయాలయితే మళ్ళీ  అతనికి దక్కలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా 'రాధే' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు  ప్రభుదేవ. కొరియన్ సినిమా 'ద ఔట్ లాస్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  మే 13న జనం ముందుకు రానుంది 'రాధే'. మరి ఈ సారి ప్రభుదేవ ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.