చిన్నపిల్లలు అలిగితే అందం.. నేను కాదు

చిన్నపిల్లలు అలిగితే అందం.. నేను కాదు

చిన్నపిల్లలు అలిగితే అందం కానీ తాను అలిగితే కాదన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. తాను అలిగాల్సిన అవసరమే లేదని చెప్పారు. విజయనగరంలో మాట్లాడుతూ రూ.43,000 కోట్ల అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి రాజకీయాలను ఉద్ధరిస్తామని తిరుగుతున్నాడంటూ వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. బొత్స, ధర్మాన, కన్నా లాంటి పదవులు పట్టుకొని వేలాడిన కొందరు నాయకులు.. నేడు సిగ్గు లేకుండా నీతులు బోధించేందుకు వస్తున్నారని అశోక్ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతితో పాటు గవర్నర్ అధికార నివాసాన్ని వ్యభిచార గృహంగా మార్చారని విమర్శించారు.

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటల స్ఫూర్తితో టీడీపీ వ్యవస్థాపకుడు, అన్న ఎన్టీఆర్ ముందుకెళ్లేవారని అశోక్ గజపతిరాజు గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రతినిధిగా ధర్మాన్ని నిలబెట్టాలని.. నీతి, నిజాయితీకి కట్టుబడబట్టే చంద్రబాబుపై ఎన్ని కేసులు వేసినా అవేవి నిలబడలేదన్నారు. తన చిన్నప్పటి నుంచి వింటున్న పోలవరం కల నేడు సాకారం అవుతోందని అశోక్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ మంచి పార్టీ, మంచి నాయకుడు, మంచి యువతి దొరికారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు నాలుగున్నరేళ్లలో 640కి పైగా అవార్డులొచ్చాయన్నారు. 

రాష్ట్ర భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది కనుక మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలని ప్రజలకు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని.. డబ్బుకో, మందుకో అమ్ముడుపోవద్దని ఓటర్లకు సూచించారు. తెలుగువాళ్లు ఎవరికీ తక్కువ కాదని చాటిచెప్పేలా.. టీడీపీ సిద్ధాంతాలు ప్రపంచమంతా తెలిసేనా తెలుగు యువత కృషి చేయాలని ఆకాంక్షించారు.