ప్రేక్షకుల మదిపై పచ్చబొట్టేసిన అనంత్ శ్రీరామ్

ప్రేక్షకుల మదిపై పచ్చబొట్టేసిన అనంత్ శ్రీరామ్

'బాహుబలి' మొదటి భాగంలో "పచ్చబొట్టేసిన పిల్లగాడి"గా ప్రభాస్ అటు ఆ చిత్రంలో తమన్నా మదిని, ఇటు ప్రేక్షకుల మనసులు దోచేశాడు. అసలు ఆ 'పచ్చబొట్టు..' వేసిన తీరును కీరవాణి బాణీల్లో పలికించిన వాడు అనంత్ శ్రీరామ్. 'నూనుగు మీసాలోడు'గా ఉన్న సమయంలోనే ఓ వైపు  చదువుకుంటూనే, మరోవైపు సినిమా పాటల బాటలో సాగాలని పదాలతో ఓ ఆట ఆడుకుంటూ వచ్చాడు అనంత్ శ్రీరామ్. తొలి చిత్రం  'కాదంటే అవుననిలే' టైటిల్ లోనే పింగళి వారి పదవిన్యాసం కనిపించడంతో అనంత్ కూడా హుషారుగా కలాన్ని పరుగులు తీయించాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా అనంత్ శ్రీరామ్ కలం కదం తొక్కుతూ పదం పాడుతూ సాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 900 పాటలు అనంత్ శ్రీరామ్ కలం నుండి జాలువారి జనాన్ని మెప్పించాయి. 

సాహితీ సుగంధం...

ఊహలకు ఊపిరి వస్తే, వాస్తవాలు వెల్లివిరుస్తాయి అన్నారు విజ్ఞులు. అనంత్ శ్రీరామ్ పదబంధాలు సైతం అదే తీరున సాగాయి. అనుభవం లేని  సందర్భాల్లోనూ ఊహాజనితమైన పదాలతో పరుగులు తీశాడు. అవే అనంత్ శ్రీరామ్ ను ప్రత్యేకంగా నిలిపాయి. అనంత్ లోని సాహిత్యశోభను చూసి కీరవాణికి ముచ్చటేసింది. తాను స్వరకల్పన చేసే చిత్రాలలో అనంత్ ను ప్రోత్సహించారాయన. మరికొందరు సంగీత దర్శకులు,  యువదర్శకులు కూడా తమ చిత్రాల్లోని సందర్భాలు వివరించగానే అనంత్ నోట పలికిన మాటలు విని ఆశ్చర్య పోయి, ఆ మాటలతోనే పాటలు రాయించుకున్నారు. తన దరికి చేరిన ఏ సినిమాకైనా న్యాయం చేయాలని తపించేవాడు అనంత్ శ్రీరామ్. ఈ తపనలో అనేక చిత్రాలలో సింగిల్ కార్డ్ కూడా వేయించుకున్నాడు. 'ఎటో వెళ్ళి పోయింది మనసు'తో ఉత్తమ గీతరచయితగా నంది అవార్డును, ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు అనంత్. ఇతనిలోని సాహిత్యాభిలాషను గమనించిన ఎందరో అనంత్ కు మిత్రులుగా మారారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రాసిన 'ఎ లవ్, అన్ కండిషనల్' రూపకల్పనలో అనంత్ శ్రీరామ్ పాత్ర కూడా ఉంది. ఇలా ఓ వైపు పాటలు రాస్తూనే, మరోవైపు తన దరికి చేరిన సాహితీగంధానికి తన పదాలతో మరింత సువాసన పెంచే ప్రయత్నం చేస్తుంటాడు అనంత్ శ్రీరామ్. 

స్వయంప్రతిభ

ఓ నాటి ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య  అనంత్ కు పెదనాన్న వరుస. ఆయన ప్రోత్సాహంతోనే అనంత్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అయితే, ఇక్కడ మాత్రం తన స్వయంప్రతిభతోనే అనంత్ రాణిస్తున్నాడు. కేవలం పాటలు రాయడంలోనే కాదు కొన్ని చిత్రాలలో అనంత్ నటించాడు కూడా. ఏది ఏమైనా, అనంత్ శ్రీరామ్ పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటూనే  ఉన్నాయి. మరిన్ని మంచి పాటలతో అనంత్ జనాన్ని మరింతగా ఆకట్టు కుంటారని ఆశిద్దాం.

(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం)