అభినయదేవేరి దేవిక

అభినయదేవేరి దేవిక

దేవిక: పేరుకు తగ్గట్లే దివినుంచి దిగివచ్చినట్లు నిండైన సౌందర్యంతో అలరించిన తార. దేవిక అసలు పేరు ప్రమీల. ఎన్టీఆర్ 'రేచుక్క'తో వెండితెరకు పరిచయం అయిన దేవిక ఆ తర్వాత ఆయన హీరోయిన్ గా అపురూపమైన విజయాలను చవిచూశారు. ఎన్టీఆర్ తో దేవిక నటించిన 'శెహభాష్ రాముడు, పెండ్లి పిలుపు, మహామంత్రి తిమ్మరుసు, నిండు మనసులు, నిలువుదోపిడి, చిన్ననాటి స్నేమితులు, కంచుకోట, రాజకోట రహస్యం, ఆడబ్రతుకు, దక్షయజ్ఞం, టాక్సీ రాముడు, రక్తసంబధం, దేశద్రోహులు, భామా విజయం, శ్రీకృష్ణావతారం, గండికోట రహస్యం' మొదలైన చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన ''శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణవిజయం, శ్రీకృష్ణాంజనేయయుద్ధం'' చిత్రాలలో రుక్మిణి పాత్రలో దేవిక అభినయం అందరినీ అలరించింది. అందుకే ఈమెను అభినయదేవేరి అని కీర్తించారు. ఎన్టీఆర్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా వెలుగొందిన దేవిక జగ్గయ్య, కాంతారావు, శోభన్ బాబు వంటి వారితోనూ నాయికగా నటించి అలరించారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారు దేవిక. దేవిక కూతురు కనక కూడా కొన్ని తమిళ, తెలుగు చిత్రాలలో నటించి అలరించింది. మొదటి నుంచి ఎన్టీఆర్ హీరోయిన్ గానే పేరొందిన దేవిక ఆయన నటించిన అనేక చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ కూడా పోషించింది. ఎన్టీఆర్ 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'లో దేవిక చివరిసారిగా కనిపించింది. తెలుగు చలన చిత్రపితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు దేవికకు సమీపబంధువు కావటం విశేషం.

(మే 2న దేవిక జయంతి సందర్భంగా)