తుమ్మల వేదాంత ధోరణి...పొగ బెడుతున్నారా ?

తుమ్మల వేదాంత ధోరణి...పొగ బెడుతున్నారా ?

"అభివృద్ధి చేసే ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించవద్దు, తప్పుడు కేసులు పెట్టి పార్టీకి నష్టం తేవొద్దు" ఇవి రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు.  పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామంలో గత నెల 11న రెండు వర్గాల మధ్య జరిగిన తగాదా రాజకీయ దుమారం రేపుతోంది. 11 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. మిగతా వారిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డికీ, తుమ్మల నాగేశ్వ‌ర‌రావుకీ ఈ మ‌ధ్య అస్స‌లు ప‌డ‌టం లేద‌న్న‌ది తెలిసిందే.

కందాల తెరాస‌లో చేరిన ద‌గ్గర్నుంచీ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చినవారికే స్థానికంగా ప్రాధాన్యత ఇస్తున్నార‌నీ, తెరాస నాయ‌కుల్నీ ముఖ్యంగా తుమ్మల అనుచ‌రుల్ని ఆయ‌న ప‌క్కన‌పెడుతున్నార‌ని అంటున్నారు. ఇది తుమ్మల వ‌ర్గానికి మింగుడుప‌డ‌టం లేదు. అంతేకాదు, ప్రభుత్వ కార్యక్రమాల‌కు కూడా ఆ వ‌ర్గాన్ని కందాల క‌లుపుకుని పోవ‌డం లేద‌ట‌.  గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మల‌పై కందాల గెలిచిన సంగ‌తీ తెలిసిందే. ఆ త‌రువాత‌, కాంగ్రెస్ నుంచి ఆయ‌న తెరాస‌లోకి వ‌చ్చి చేరారు. గెలిచిన ఎమ్మెల్యేగా కందాల‌కు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో తుమ్మలను ప‌క్కనపెడుతున్నార‌నే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడితో ఆగక ఇటీవల తుమ్మలను ఆ ఎమ్మెల్యే దురుసు మాటలతో బాధ పెట్టినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానం దగ్గరకు తీసుకెళ్ళినా ఉపయోగం ఉండదని తుమ్మల భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఆయన బహిరంగంగా వేదాంతం వ్యక్తం చేస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే పార్టీని, ముఖ్యంగా కేసీఆర్‌పై న‌మ్మకంతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి టీఆర్ఎస్‌కు జై కొట్టిన చాలా మంది సీనియ‌ర్లను ఇప్పుడు పార్టీ అధినేత ప‌ట్టించుకోవ‌డం మానేశారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన వారు కూడా వీరిలో ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఇలాంటి వారు అందరూ (తుమ్మల)తో సహా త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఇలా ప‌క్కన పెట్టిన నాయ‌కుల్లో మాజీ హోం మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర‌రావు, వేణుగోపాలాచారి, మందా జగన్నాథం, స్వామి గౌడ్, మధు సూద‌నా చారి, ఏనుగు రవీందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ ఉప‌ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వంటి వారిపేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు మొదటి నుండి ఉన్న తుమ్మల వ్యతిరేక వర్గం నామా, పొంగులేటి, పువ్వాడ వంటి వారు అందరూ ఒకే గూటికి చేరడంతో తుమ్మలకి ఇబ్బందులు మొదలయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో  చూడాలి.