నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీలపై రాజకీయ దుమారం!
ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు! ఆ మంత్రిగారికి ఇది సరిగ్గా సరిపోతుందని స్వపక్ష నేతలు.. విపక్ష నాయకులు గుర్రుగా ఉన్నారట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పడిదే హాట్ టాపిక్. ఇంతకీ ఎవరా మంత్రి? ఏంటా నీతి కథ?
నెల్లూరులో ఫ్లెక్సీ రూల్స్ కొందరికే వర్తిస్తాయా?
సింహపురి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. వాడీవేడీ చర్చ జరుగుతోంది. నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నిషేధం ఉంది. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ నిర్ణయం తీసుకున్నారు. మంత్రే చెప్పడంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఊరుకుంటారా? తమ పవర్ ఏంటో రుచి చూపించారు. వాళ్లూ వీళ్లు అని తేడా లేదు ఎవరు ఫ్లెక్సీలు పెట్టినా క్షణాల్లో తొలగించి.. చట్టం ముందు అంతా సమానమే.. రూల్ ఫర్ ఆల్ అనే పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను చూసిన వారు చట్టం కొందరికి చుట్టమనే కామెంట్స్ చేస్తున్నారు.
నగరమంతా మంత్రులు అనిల్, గౌతంరెడ్డిల ఫ్లెక్సీలే!
ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా సిటీ మొత్తాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. నెల్లూరులో ఎటు చూసినా ఇవే కనిపించాయి. అన్నింటిలోనూ మంత్రులు అనిల్‌కుమార్, మేకపాటి గౌతంరెడ్డి ఫొటోలే. అదేంటి.. రూల్ పెట్టిన వారే దానిని ఎందుకు బ్రేక్ చేశారని అధికార పార్టీకి చెందిన కొందరు చెవులు కొరుక్కుంటుంటే.. స్వపక్షానికి చెందిన మరికొందరు మంత్రి అనిల్‌పై గుర్రుగా ఉన్నారట. ఎదుటివారికి చెప్పేందుకే నీతులా అని మండిపడుతున్నట్టు సమాచారం. రూల్ ఫర్ ఆల్ అన్న మంత్రి.. ఆ నిబంధనలను తుంగలో తొక్కడంపై విపక్షాలు మరింత గరంగరంగా ఉన్నాయట.
మంత్రిగారి మాటలకు.. చేతలకు అర్థాలే వేరా?
అధినేత దృష్టిలో పడి.. ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని మంత్రులు అనిల్, గౌతంరెడ్డి చేసిన ఈ ఫ్లెక్సీల ప్రయత్నం వారికి సంతోషాన్నిచ్చినా క్షేత్రస్థాయిలో వస్తోన్న రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. మంత్రిగారి మాటలకు.. చేతలకు అర్థాలే వేరని సొంత పార్టీ నాయకులే కామెంట్స్ చేస్తున్నారు. నెల్లూరు నగరాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్ల రహితంగా మార్చాలన్నది మంచి నిర్ణయమే అయినా.. అది కొందరికే పరిమితం అన్నట్టు అమలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య ఇంత వివాదం రేగడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే ప్రస్తుతం చర్చకు కారణం అవుతున్నాయి.
అంతా ఒక్కటే అని చెప్పినా.. ఇప్పుడేమైంది?
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలను తీసేశారు. ఆనం ఫ్యామిలీలో కొందరు వైసీపీలోనే ఉన్నారు. వివేక సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫ్లెక్సీ తొలగింపుపై వివేక కుమారుడు రంగమయూర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఓపెన్‌గానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివేక ఫ్లెక్సీల తొలగింపు అధికారపార్టీలోనే చర్చకు కారణమైంది. ఈ ఎపిసోడ్‌పై చర్చ కొనసాగుతుండగానే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నెల్లూరు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసి బీజేపీ జెండాలను, ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బీజేపీ జెండాలు తీసేయడం ద్వారా రూల్ ముందు అంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేసినా.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ కావడం.. మంత్రుల ఫ్లెక్సీలతో నెల్లూరును నింపేయడంపై ఒక్కటే చర్చ రచ్చ జరుగుతోంది.
ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంటోందా?
ప్రస్తుతం అయితే ఈ అంశంపై అటు మంత్రి కానీ.. ఇటు వైసీపీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ ఓపెన్‌గా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కాకపోతే సమస్య మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉందని చెబుతున్నారు. మరి.. సింహపురి ఫ్లెక్సీల రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)