ఏపీకి అందుకే హోదా ఇవ్వలేదు...

ఏపీకి అందుకే హోదా ఇవ్వలేదు...

అవిశ్వాస తీర్మానం చర్చలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇస్తూ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ... లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు మధ్య తేడా ఉండదని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని వెల్లడించిన మోడీ... 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు తమ చేతులు కట్టేయడంవల్లే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని వివరించారు. మరోవైపు ఒక రాష్ట్రానికి చేసే సహాయం, మరో రాష్ట్రంపై ప్రభావం చూపించొద్దనే తమ అభిమతం అన్నారు మోడీ. ఏపీకి హోదాపై స్వయంగా గతంలో వీరప్ప మొయిలీ లోక్‌సభలో అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేసిన ప్రధాని... ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం... ఆ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. 
 
ఏపీ అభివృద్ధికి స్పెషల్ స్టేటస్‌తో లభించే ప్రయోజనాలకు సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని 2016 సెప్టెంబరులోనే నిర్ణయించామని తెలిపారు ప్రధాని మోడీ... ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిని స్వాగతించారని గుర్తు చేసిన ప్రధాని... కానీ, కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఇక ఎన్డీఏ నుంచి వైదొలగాలని తెలుగుదేశం నిర్ణయించుకున్నప్పుడు తాను స్వయంగా బాబుకు ఫోన్‌ చేసి... మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలలో పడుతున్నారు. దాని నుంచి బయటపడలేరు’ అని చెప్పినట్టు వెల్లడించిన ప్రధాని... ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలను పార్లమెంటు వరకు వచ్చాయని విమర్శించారు. ఇక విభజన అంశాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవలు పడుతుంటే మొదటి ఏడాదే పడుతుంటే... గవర్నర్‌, హోంమంత్రి, తాను సమావేశమై పరిష్కరించామని చెప్పారు. కేసీఆర్, చంద్రబాబును శాంతపరిచేందుకు ప్రయత్నించామన్న మోడీ... టీఆర్‌ఎస్‌ పరిణతి ప్రదర్శించి అభివృద్ధిపై దృష్టి సారించిందని, కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్యానించారు.